
‘నిషా’చరులపై కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో నడుస్తున్న పబ్బుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు మ్యూజిక్ ప్లేకి, ఒంటి గంట వరకు పబ్ నడవడానికి అనుమతి ఉంది. మద్యం తాగి వాహనాలు పడిపే వారికి చెక్ చెప్పడానికి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే డ్రంకన్ డ్రైవ్స్ రాత్రి 10 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు జరుగుతున్నాయి. అంటే పబ్స్, డ్రైవ్స్ రెండూ ఒకే సమయంలో పూర్తవుతున్నాయి. ఫలితంగా అర్ధరాత్రి ఒంటి గంటకు ఫూటుగా తాగి బయటకు వచ్చినా పట్టుకునే నాథుడే ఉండట్లేదు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న దేవి, భరత్ కారు ప్రమాదం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆ సమయంలో భరత్ మద్యం తాగి ఉండటాన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి డ్రంకన్ డ్రైవ్స్ నిర్వహించే సమయాలను సమూలంగా మార్చాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా ట్రాఫిక్ విభాగం అధికారుల్ని ఆదేశించనున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్స్ కనీసం తెల్లవారుజామున 2.30 గంటల వరకు అయినా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. దీంతో పాటు మద్యం మత్తులో ప్రమాదాలు చేసి ఎదుటి వారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే దేవి ప్రయాణిస్తున్న కారు డ్రైవ్ చేసిన భరత్‌సింహారెడ్డిపై ఐపీసీలోని సెక్షన్ 304 (పార్ట్-2) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇకపై నగర వ్యాప్తంగా ఇదే విధానం అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ‘304(ఎ)’...
సాధారణంగా రోడ్డు ప్రమాద సంబంధ ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు పోలీసులు ఐపీసీ సెక్షన్ 304 (ఎ) కింద కేసు నమోదు చేస్తారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి నిర్లక్ష్యంగా, మితిమీరిన వేగంతో దూసుకువచ్చి ఢీ కొట్టాడని తేల్చేస్తారు. అయితే ఆ ప్రమాదాలకు కారణాలు విశ్లేషించడం వంటివి అరుదుగా జరుగుతాయి. దీనికి ఫిర్యాదు దారుల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో పాటు మరెన్నో కారణాలు ఉంటున్నాయి. అయితే మద్యం తాగి వాహనం నడుపుతున్న వారిపై కేసు నమోదుకు ఐపీసీలోని 304 పార్ట్ 2 సెక్షన్ సరిగ్గా సరిపోతుందని పోలీసులు నిర్ణయించారు.
అంటే మద్యం తాగిన సదరు వ్యక్తి తన డ్రైవింగ్ వల్ల ఎదుటి వారికి ప్రాణహాని ఉందని తెలిసీ పట్టించుకోకపోవడం. ఇలాంటి కేసుల్లో బెయిల్ సైతం తొందరగా లభించదు. న్యాయస్థానంలో నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల నుంచి జీవిత ఖైదు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ‘దేవిని ఇంటి దగ్గర దింపే బాధ్యత తీసుకున్న భరత్ ఆ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. మద్యం తాగి మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ ఆమె మృతికి కారణమయ్యాడు. ఇది దురదృష్టకర ఘటన. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగానే 304 (పార్ట్-2) కింద కేసుల నమోదుకు నిర్ణయం తీసుకున్నాం’ అని కొత్వాల్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు.