సాక్షి, ముంబై : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గిందని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. డిసెంబర్ 31న రాత్రి మద్యం సేవించి వాహనాలు నడిపిన 523 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపిన వారిలో టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. మొత్తంగా 6,676 నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయన్నారు. అయితే ఎటువంటి ప్రాణాంతకమైన సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. ఠాణే, నవీ ముంబై, మీరా-భయందర్, వసాయి-విరార్‌లలో 1,041 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. ముంబై కన్నా ఠాణేలో 19 శాతం కేసులు అధికంగా నమోదవడం విశేషం. నగరంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే మలాడ్‌లో 57 కేసులు నమోదయ్యాయి.
ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిలో 26 నుంచి 30 ఏళ్లలోపు వారు 149 మంది ఉన్నారు. అంతేకాకుండా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన 1,317 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. కాగా, 70 ప్రాంతాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నాకా బందీని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన వారిని ఏ బార్‌లో మద్యం సేవించారో కూడా విచారించామని పోలీసు కమిషనర్ ఉపాధ్యాయ తెలిపారు. సదరు బార్ యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన సుమారు 12వేల మంది డ్రైవర్లకు గులాబి పువ్వులు అందచేశామని ఉపాధ్యాయ చెప్పారు.
తగ్గిన డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు
Published Fri, Jan 2 2015 11:11 PM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM
Advertisement
Advertisement