
విద్యార్థుల మధ్య కత్తిపోట్లు: ఒకరి మృతి
డిగ్రీ విద్యార్థుల మధ్య చిన్న విషయంలో మొదలైన గొడవ కాస్తా.. చివరకు పెద్దగా మారి కత్తిపోట్లకు దారితీసింది. దాంతో ఓ విద్యార్థి మరణించాడు. ఈ దురదృష్టకరమైన ఘటన హైదరాబాద్ సుల్తాన్ బజార్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కళాశాలలో జరిగింది. జూనియర్లు, సీనియర్ల మధ్య జరిగిన గొడవలో బీకాం సెకండియార్ చదువుతున్న హర్షవర్ధనరావు అనే విద్యార్థి తీవ్రంగా కత్తిపోట్లకు గురయ్యాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడిని నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా, ఫలితం లేక మరణించాడు. ఈ విషయాన్ని కేర్ వైద్యులు ధ్రువీకరించారు.
సెకండియర్ చదువుతున్న హర్షవర్ధన్ను కొంతమంది విద్యార్థులు కలిసి ఓ సీసాతో తలపైన కొట్టినట్లు తెలిసింది. వీళ్లలో సతీష్ అనే సీనియర్ విద్యార్థి పాత్ర ఉన్నట్లు కొంతమంది చెబుతున్నారు. గొడవ పొద్దున్నే జరిగినా, హర్షవర్ధన్ మరణించిన తర్వాతే విషయం బయటకు పొక్కింది. ఇంతకుముందు కూడా విద్యార్థుల మధ్య గొడవలు జరిగాయి. ర్యాగింగ్ కారణంగా గతంలో కొంతమందిని డిబార్ చేశారు. ప్రేమ వ్యవహారమే తాజా గొడవకు కారణమని తెలిసింది. ఇంతకుముందు కూడా విద్యార్థుల మధ్య గొడవలు ఉన్నా, పొడుచుకుని చంపుకొనేంత పరిస్థితి ఎప్పుడూ లేదు. తొలుత విద్యార్థి మృతి విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. తర్వాత ఫిర్యాదు అందడంతో మొత్తం బయటకు చెప్పారు. ఈ వ్యవహారంతో కోఠి, సుల్తాన్బజార్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.