
ప్రశ్నించినందుకు ప్రాణం తీశాడు
అమ్మాయిని ఎందుకు టీజ్ చేస్తున్నావన్న జూనియర్‌పై పిడిగుద్దులు కురిపించిన సీనియర్
విచక్షణరహితంగా కొట్టడంతో క్లాస్‌రూంలో అపస్మారక స్థితిలో పడిపోయిన హర్షవర్ధన్‌రావు
ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య నాలుగు గంటలు పోరాడి మృత్యుఒడిలోకి..
నగరంలోని ప్రగతి మహా విద్యాలయలో ఘటన
సాక్షి, హైదరాబాద్: అమ్మాయిని ఎందుకు టీజ్ చేస్తున్నావని అడిగిన పాపానికి పిడిగుద్దులు కురిపించాడు.. సీనియర్‌నన్న తలబిరుసుతో జూనియర్ విద్యార్థిని ఇష్టానుసారం కొట్టాడు.. చివరికి ఆ విద్యార్థి 4 గంటలపాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడి ప్రాణాలు వదిలాడు! నగరం నడిబొడ్డున సుల్తాన్‌బజార్ లోని ప్రగతి మహా విద్యాలయలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
రాంకోఠికి చెందిన ఆటోమొబైల్ వ్యాపారి నర్సింగ్‌రావు రెండో కుమారుడు కోట హర్షవర్ధన్ రావు(18) ప్రగతి మహా విద్యాలయంలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే కాలేజీలో జియాగూడకు చెందిన సతీశ్ కోడ్కర్(19) బీకాం ఫైనలియర్ చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామ సమయంలో విద్యార్థులు క్లాస్ రూమ్‌లోంచి బయటికి వచ్చారు. తరగతి గదిలో హర్షవర్ధన్, మరో విద్యార్థిని ఉన్నారు. ఇదే సమయంలో రూమ్ నంబర్ 211లో ఉన్న సతీశ్... 203 రూమ్‌లో ఉన్న హర్షవర్ధన్ తరగతి గదికి వచ్చాడు. వస్తూనే విద్యార్థినిని తన మాటలతో వేధించాడు. ‘‘ఆమెను ఎందుకు కామెంట్ చేస్తున్నావు’’ అని హర్షవర్ధన్ నిలదీశాడు. దీంతో సీనియర్లనే ప్రశ్నిస్తావా.. అంటూ హర్షవర్ధన్‌పై సతీశ్ విచక్షణరహితంగా పిడిగుద్దులు కురిపించాడు. మెడ, తల వెనుక భాగం, ఛాతీపై బలంగా గుద్దడంతో హర్షవర్ధన్ అక్కడే అపస్మారక స్థితిలో పడి పోయాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు ఆయనను బయటికి తీసుకువచ్చి, ఆటోలో సమీపంలోని ఆదిత్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు సీటీ స్కాన్ చేశారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్సకు నిరాకరించారు. వెంటనే హర్షవర్ధన్‌ను నాంపల్లి కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా చికిత్సకు నిరాకరించారు. చివరికి పోలీసుల జోక్యంతో ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. సుమారు 4 గంటల పాటు ఆయన్ని బతికించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హర్షవర్ధన్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలియగానే కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జరిగిన వివాదంపై ఆరా తీశారు.
తెలివైన విద్యార్థి..
హర్షవర్ధన్‌కు తెలివైన విద్యార్థిగా పేరుంది. తండ్రి సంపాదనకు చేదోడువాదోడుగా ఉండేం దుకు పగటి పూట చదువుకుంటూ.. రాత్రి పూట అపోలో ఫార్మసీలో పనిచేస్తున్నాడు. హర్షవర్ధన్ తల్లి ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. హర్షవర్ధన్ మృతి విషయం తెలియగానే తల్లిదండ్రులు హుటాహుటిన కేర్ ఆసుపత్రికి చేరుకుని గుండెలు పగిలేలా రోదించారు. హర్షవర్ధన్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. సతీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
మేమేం చేస్తాం: కాలేజీ కరస్పాండెంట్
విద్యార్థుల ఘర్షణపై కాలేజీ కరస్పాండెంట్ రాజేశ్ సి షాను వివరణ కోరగా.. ‘ఇద్దరు కొట్టుకుంటే మేమేం చేస్తాం..’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. గతంలో కూడా ఈ కాలేజీలో గొడవలు జరిగాయి. ఇటీవల ఓ విద్యార్థి ఈవ్ టీజింగ్ కేసులో జైలుకు వెళ్లాడు. గతంలో ర్యాగింగ్ కేసు సంచలనం సృష్టించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల ఆందోళనలు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి.