కల్లలవుతున్న‘డాలర్ డ్రీమ్స్’ | students dollar dreams problems at america | Sakshi
Sakshi News home page

కల్లలవుతున్న‘డాలర్ డ్రీమ్స్’

Published Tue, Dec 29 2015 1:56 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

కల్లలవుతున్న‘డాలర్ డ్రీమ్స్’ - Sakshi

కల్లలవుతున్న‘డాలర్ డ్రీమ్స్’

      పనిచేస్తే పంపేయడమే!
      అమెరికాలో పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తున్న వారిని వెతికి పట్టుకుంటున్న ఎఫ్‌బీఐ
      వర్సిటీల నుంచి విదేశీ విద్యార్థుల
      వివరాల సేకరణ.. నివాసాల్లోనూ సోదాలు
      టెక్సాస్, కాలిఫోర్నియాలో 150 మంది గుర్తింపు.. తిరిగి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు
      వారిలో 38 మంది వరకు
      తెలుగు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం
      సరైన ఆర్థిక వనరులు లేకపోయినా, గుర్తింపు లేని వర్సిటీల్లో చేరినా
      తప్పని ఇబ్బందులు... గుర్తింపు లేని 38 విశ్వవిద్యాలయాల
      జాబితాను కాన్సులేట్‌లకు అందజేసిన అమెరికా
      త్వరలో మరో 100 గుర్తింపు లేని వర్సిటీల జాబితా ప్రకటించే అవకాశం

 
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో విద్యను అభ్యసించేందుకు వెళ్లి వర్సిటీల వెలుపల పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్న భారత విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు తనిఖీలు చేపట్టారు. గడచిన మంగళ, బుధవారాల్లో (క్రిస్‌మస్‌కు ముందు) వర్సిటీ వెలుపల పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న దాదాపు 150 మందిని ఎఫ్‌బీఐ  పట్టుకుంది.

వారంతా కాలిఫోర్నియా, టెక్సాస్, డెలావర్‌లో ఎంఎస్ డిగ్రీ చదువుతున్నవారే. వారిలో కొందరు ఒక సెమిస్టర్ పూర్తిచేసుకోగా మరికొందరు రెండు, మూడు సెమిస్టర్‌లు పూర్తి చేశారు. ఇలా పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ దొరికిన వారి విషయంలో అమెరికా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే వారి పాస్‌పోర్టులను మాత్రం ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుని అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది.

‘కొందరు విద్యార్థులను ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకున్న విషయం మా దృష్టికి వచ్చింది. యూనివర్సిటీలకు సెలవుల కారణంగా బయట పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నందువల్ల మొదటి తప్పుగా భావించి వదిలేయాలని మేం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..’’ అని తానా అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.  పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నామని.. వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 38 మంది ఉన్నారని ఇప్పటివరకు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు.

 

ఆందోళనలో స్ప్రింగ్ సీజన్ విద్యార్థులు
అమెరికాలో చదువుకునేందుకు అవసరమైన ఆర్థిక వనరులు చూపని మరో 20 మంది భారత విద్యార్థులను షికాగోలో పోలీసులు వెనక్కి పంపిన నేపథ్యంలో... స్ప్రింగ్ సీజన్ (డిసెంబర్‌లో మొదలయ్యే విద్యాసంవత్సరం)లో చదువుకునేందుకు అమెరికా వీసా పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రయాణాలు పెట్టుకున్న     
ఈ విద్యార్థులంతా.. తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.

భారత్ నుంచి అమెరికా వెళ్లాల్సిన విద్యార్థులు దాదాపు ఆరు వేల మంది తాత్కాలికంగా ఆగిపోయారని... ఆయా వర్సిటీల నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన తర్వాత బయలుదేరుతారని న్యూయార్క్‌లో భారత విద్యార్థుల స్థితిగతులను చూసే ఓ కన్సల్టెన్సీ యజమాని హర్‌ప్రీత్‌సింగ్ వెల్లడించారు. భారత విద్యార్థులు చదువు కంటే పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు ప్రాధాన్యతనిస్తున్నారని ఎఫ్‌బీఐ పేర్కొన్న నేపథ్యంలో... గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, కొంత స్పష్టత వచ్చేదాకా విద్యార్థులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని ఆయన సూచించారు.

 గుర్తింపు లేని ‘ఐ20’తో ఇక్కట్లు
గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలు ఇచ్చిన ‘ఐ20 (అడ్మిషన్ ధ్రువపత్రం)’తో అమెరికా వెళుతున్న విద్యార్థులను అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపుతున్నారు. అయితే ఆ వర్సిటీలు ఏమిటో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి. అమెరికా కాన్సులేట్ వీసా మంజూరు చేసిందంటే అది మంచి యూనివర్సిటీయేనని నమ్ముతున్నారు.
‘‘మా అబ్బాయికి జీఆర్‌ఈలో 287, టోఫెల్‌లో 75 స్కోర్ వచ్చింది. షికాగోలోని డీపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్‌లో సీటు వచ్చింది. ఆ ‘ఐ20’తో వీసా కూడా వచ్చింది. ఆర్థిక వనరులు ఉన్నట్లు అన్ని ఆధారాలు కూడా మా అబ్బాయితో ఉన్నాయి. కానీ ఎందుకో మా వాడిని తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించి అధికారులు వారి కస్టడీలో పెట్టుకున్నారు..’’ అని హైదరాబాద్‌లోని సంజీవరెడ్డినగర్ నివాసి రెడ్డిగారి సత్యనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికాలోని ఓ కన్సల్టెన్సీ సంస్థ నుంచి 38 గుర్తింపు లేని యూనివర్సిటీల జాబితాను సాక్షి సంపాదించింది. ఇలాంటి మరో వంద యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థలు ఉన్నాయని.. వాటి వివరాలను త్వరలోనే అమెరికా ప్రభుత్వం వెల్లడించే అవకాశముందని ఆ కన్సల్టెన్సీ ప్రతినిధి చెప్పారు.

అమెరికాలో గుర్తింపులేని యూనివర్సిటీలు
 అరిజోనాలోని.. అమెరికన్ బైబిల్ కాలేజీ యూనివర్సిటీ, అమెరికన్ సెంట్రల్ యూనివర్సిటీ; న్యూమెక్సికోలోని అమెరికన్ సెంచరీ యూనివర్సిటీ; కాలిఫోర్నియాలోని అమెరికన్ కోస్ట్‌లైన్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా స్కూల్ అఫ్ టెక్నాలజీ, క్లేటన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, గోల్డెన్ స్టేట్ బాప్టిస్ట్ కాలేజ్, గోల్డెన్ స్టేట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ అమెరికన్ యూనివర్సిటీ, వెస్ట్‌కోస్ట్ బాప్టిస్ట్ కాలేజ్, ఇంటర్నేషనల్ బైబిల్ యూనివర్సిటీ, పసిఫిక్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బెర్క్‌లీ; హవాయిలోని అమెరికన్ స్టేట్ యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ హవాయి; ఫ్లోరిడాలోని ఏమ్స్ క్రిస్టియన్ యూనివర్సిటీ, బ్యారింగ్‌టన్ యూనివర్సిటీ, బెల్‌ఫోర్డ్ యూనివర్సిటీ; జార్జియాలోని అండర్సన్ విల్లే టెక్నాలజికల్ యూనివర్సిటీ;

టెక్సాస్‌లోని బీహెచ్ కారోల్ టెక్నలాజికల్ వర్సిటీ, కార్నర్ టెక్నాలజికల్ హౌస్; ఒరెగాన్‌లోని బిలవ్‌డ్ కమ్యూనిటీ యూనివర్సిటీ, క్యాంబీ బైబిల్ కాలేజ్; ఆర్కన్సాస్‌లోని బెట్టిస్ క్రిస్టియన్ యూనివర్సిటీ; మిసిసిపిలోని బిన్‌విల్లే యూనివర్సిటీ, కాల్ సదరన్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జి స్టేట్ యూనివర్సిటీ, కెన్‌బోర్స్‌యూనివర్సిటీ, కొలంబస్ యూనివర్సిటీ; లూసియానాలోని క్యాపిటల్ సిటీ రిలీజియన్ ఇనిస్టిట్యూట్, క్రిసెంట్ సిటీ క్రిస్టియన్ కాలేజ్; వర్జీనియాలోని కరోలినా ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ; అలబామాలోని చాడ్విక్ యూనివర్సిటీ; నార్త్ కరోలినాలోని క్రిస్టియన్ బైబిల్ కాలేజ్; న్యూయార్క్‌లోని క్రిస్టియన్ లీడర్‌షిప్ యూనివర్సిటీ; టెన్నెస్సీలోని క్లర్క్‌వెల్లీ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ; వాషింగ్టన్‌లోని క్రౌన్ కాలేజ్; మిషిగాన్‌లోని వెస్టర్న్ మిషిగాన్ బైబిల్ యూనివర్సిటీ.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement