ఉస్మానియా కోసం లేఖాయుద్ధం! | Student's letters in hundreds to nizam government | Sakshi
Sakshi News home page

ఉస్మానియా కోసం లేఖాయుద్ధం!

Published Tue, Apr 25 2017 2:10 AM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

ఉస్మానియా కోసం లేఖాయుద్ధం!

ఉస్మానియా కోసం లేఖాయుద్ధం!

నిజాం సర్కారుకు వందల సంఖ్యలో విద్యార్థుల లేఖలు
హైదరాబాద్‌ విద్యా సమితి ఏర్పాటు

- సమితి సభ్యుల ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి
- చివరికి వర్సిటీ ఏర్పాటుకు నిజాం ఫర్మానా
- పలు ప్రత్యేకతలతో అరబ్బీ భాషలో లోగో


ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి ముందు కొన్ని కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం విద్యార్థులు ఒక రకంగా లేఖాయుద్ధమే చేశారు. వారికి మద్దతుగా విద్యావేత్తలు, సామాజికవేత్తలు ‘హైదరాబాద్‌ విద్యా సమితి’ని ఏర్పాటు చేసి.. ఉద్యమమూ ప్రారంభించారు. చివరికి ఇది నిజాం వద్దకు వెళ్లడంతో ఉస్మానియా ఏర్పాటుకు బీజం పడింది.  
 – మహ్మద్‌ మంజూర్‌

లేఖాస్త్రాలు.. ఉద్యమాలు..
1887లో నిజాం కళాశాల ఏర్పాటైంది. అందులో చదివిన విద్యార్థులకు బ్రిటిష్‌వారి అధీనంలోని మద్రాస్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ సర్టిఫికెట్లు అందజేసేవారు. ఆ వర్సిటీ విధానాలు, నిజాం విద్యా విధానాలు వేరుగా ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు చదువులను మధ్యలోనే వదిలేశారు. కొంతకాలానికి వందల సంఖ్యలో విద్యార్థులు హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలంటూ నిజాం సర్కారుకు లేఖలు రాయడం మొదలుపెట్టారు. ఆ లేఖల సారాంశం తెలుపుతూ అప్పటి న్యాయ, విద్యాశాఖ కార్యదర్శి అక్బర్‌ హైదరీ నిజాం ప్రభుత్వానికి ప్రతి వారం ఒక లేఖ రాసేవారు.



కానీ ప్రభుత్వం తరఫున స్పందన కనిపించలేదు. చివరికి 1914లో విశ్వవిద్యాలయ ఉద్యమం ప్రారంభించారు. సంస్థానంలోని విద్యా విభాగంలో పనిచేస్తున్న విద్యావేత్తలు, పత్రికా సంపాదకులు, సామాజిక వేత్తలు, ధార్మిక పండితులతో 1914లో అక్బర్‌ హైదరీ హైదరాబాద్‌ ఎడ్యుకేషన్‌ సమితి ఏర్పాటు చేశారు. అందులో సరోజినీనాయుడు, మహ్మద్‌ ముర్తజా, అబ్దుల్‌ బాసిత్, మహ్మద్‌ అక్బర్‌ అలీఖాన్‌లను సభ్యులుగా నియమించారు. కమిటీ పలు దఫాలు సమావేశమై.. వర్సిటీ ఏర్పాటు ఆవశ్యకతపై నిజాం సర్కారుపై ఒత్తిడి తెచ్చింది. నిజాం సంస్థానం ధనికంగా ఉన్నా.. విద్యకు ప్రా«ధాన్యత లేదన్న బ్రిటిష్‌ పాలకుల వ్యాఖ్యలనూ సర్కారు దృష్టికి తెచ్చింది. 1914 నుంచి 1917 వరకు ఈ కమిటీ పలు నివేదికలను సమర్పించింది. దీంతో 1917 ఏప్రిల్‌ 26న విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిజాం ఫర్మానా జారీ చేశారు.

ఓయూ విద్యార్థుల తొలి ధర్నా..
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల ఐక్యత తొలి నుంచీ బలంగానే ఉంది. 1938లో ఆర్ట్స్‌ విభాగంలో చదువుతున్న ఓ విద్యార్థి టికెట్‌ లేకుండా ప్రయాణం చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆ విషయం విద్యార్థులకు చేరింది. అరెస్టుకు వ్యతిరేకంగా దాదాపు 200 మంది విద్యార్థులు నిజాం సంస్థానం ప్రధానమంత్రి నివాసం షామంజిల్‌ (ప్రస్తుతం దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌) ముందు ధర్నాకు దిగారు. వర్సిటీ విద్యార్థిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి పోలీసులకు సమాచారమివ్వకుండా.. విద్యావేత్త అయిన బహదూర్‌ యార్‌ జంగ్‌ను పిలిపించి విద్యార్థులకు నచ్చజెప్పాలని కోరారు. ఆయన వచ్చినా విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో.. స్వయంగా ప్రధానమంత్రి బయటికి వచ్చారు. చాలా సేపటి నుంచి ఏమీ తినకుండా, తాగకుండా ఉన్నారు, అలసిపోయారంటూ విద్యార్థులకు పళ్లు, ఫలాలు, షర్బత్‌ ఇప్పించారు. ప్రధాని తీరుతో విద్యార్థుల కోపం తగ్గింది. అనంతరం విద్యార్థిని విడుదల చేశారు. దీన్ని ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల తొలి ధర్నాగా చెబుతారు.

అత్యున్నత ప్రమాణాలు పాటిద్దాం..
‘‘విద్యాశాఖ ద్వారా (1917 ఏప్రిల్‌ 21, శనివారం) పంపిన ఉత్తరం అందింది. బ్రిటిష్‌ వైస్రా య్‌ ప్రసంగ సారాంశం, హైదరాబాద్‌ సంస్థాన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న సూచనలు, సలహాలతో ఏకీభవిస్తున్నాం. నిజాం సంస్థానంలో అత్యున్నత ప్రమాణాలతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇస్తున్నాం. ఈ విశ్వవిద్యాలయంలో ఆధునిక, ప్రాచీన విద్యతో పాటు తూర్పు, పాశ్చాత్య (ఈస్టర్న్, వెస్టర్న్‌) విద్యను కూడా బోధించాలి. విద్యావ్యాప్తితో పాటు నైతిక ప్రమాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అన్ని విభాగాల్లో అత్యుత్తమ పరిశోధనలు జరగాలి. బోధన ఉర్దూలో జరపాలని నిర్ణయించాం. విశ్వవిద్యాలయానికి ఉస్మానియా యూనివర్సిటీగా నామకరణం చేయండి’’ 1917 ఏప్రిల్‌ 26న ఓయూ ఏర్పాటుకు నిజాం జారీ చేసిన ఫర్మానా సారాంశమిది.

పసుపు రంగులో..
1917లో ఉస్మానియా వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. దేశవిదేశాలకు చెందిన వర్సిటీ లోగోలను పరిశీలించి.. వందకుపైగా లొగోలు తయారు చేయించారు. ఇతర వర్సిటీల తరహాలో గుండ్రంగా కాకుండా విభిన్నంగా లోగో ఉండాలని నిర్ణయించారు. అలా విభిన్నంగా ఉన్న 32 లోగోల నుంచి ఐదింటిని జల్లెడ పట్టి.. అందులో విద్య ప్రాముఖ్యతను తెలుపుతూ అరబ్బీ భాషలో ఉన్న లోగోను ఎంపిక చేసి నిజాంకు పంపారు. దానిని పరిశీలించిన నిజాం పలు సూచనలు చేస్తూ 1919 జూలై 16న ఫర్మానా జారీ చేశారు.

ఫర్మానా సారాంశమిది..
‘‘మోనోగ్రామ్‌ (లొగో) నమునా బాగుంది. విశ్వవిద్యాలయం భవనం న„ŠS (నమునా) తయారయ్యే వరకు లోగో మధ్యలో అరబ్బీ అక్షరం (అయిన్‌) ప్రవేశపెట్టండి. లోగోకు మా సంస్థానం రంగు అయిన పసుపుపచ్చ రంగును సూచిస్తున్నాం’’.

స్వాతంత్య్ర పోరాట బాటలో..
స్వాతంత్య్రం కోసం దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఉద్యమాలు కొనసాగుతున్నా.. 1942 వరకు ఉస్మానియాలో మాత్రం బయటపడలేదు. వర్సిటీ ల్లో స్వాతంత్య్ర పోరాట సంఘాలను ఏర్పాటు చేయడం కోసం రవీంద్రనాథ్‌ ఠాగూర్, మున్షీ ప్రేమ్‌చంద్‌ ఆధ్వర్యంలో విద్యావేత్తలు, మేధావులు, రచయితలతో ఓ సంస్థ ప్రారంభమైంది. 1942లో ఆ సంస్థ నేతలు ఉస్మానియా విద్యార్థులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి స్వాతంత్య్ర ఉద్యమ ఆవశ్యకతను వివరించి.. ఒక సంఘాన్ని ఏర్పాటు చేయించారు. దానికి ‘హైదరాబాద్‌ తరఖీ పసంద్‌ తరహరీక్‌ (హైదరాబాద్‌ అభివృద్ధిని నచ్చే సంస్థ)’గా పేరు పెట్టారు.

మఖ్దూం మొహియుద్దీన్, రాజ్‌ బహదూర్, మీర్‌హసన్, మహబూబ్‌ హసన్‌జిగర్, అబిద్‌ అలీఖాన్‌ తదితరులు సంస్థ బాధ్యతలు స్వీకరించారు. ఇలా నిజాం పాలకుల నుంచి విముక్తి కోసం తొలి ఉద్యమం పుట్టింది. రజాకార్ల అరాచకాలు, అత్యాచారాలను ఈ సంస్థ ద్వారా నిజాం సర్కారు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు సర్కారుకు లేఖలు రాశారు. ఇక భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం.. నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేశారు.

లోగో ప్రత్యేకతలివి..





లోగోలో పైన అరబ్బీలో ‘నూర్‌ అలా నూర్‌ (జ్ఞానంతోనే వెలుగు)’అనే పదం ఉంటుంది. దాని కింద ఆసిఫీయా సంస్థానం దస్తార్‌ (టోపీ) ఆకృతి. దాని కింద అరబ్బీలో ‘అనా మధీనతున్‌ ఇల్‌మ్‌ వ అలీ బాబు హా (నేను (మహ్మద్‌ ప్రవక్త) జ్ఞాన నగరం మదీనా హజ్రత్‌ అలీ. దాని ముఖ ద్వారం)’అని ఉంటుంది. మధ్యలో అరబ్బీ అక్షరం. (నిజాం ఉస్మాన్‌అలీ ఖాన్‌ పేరు అరబ్బీ భాషలో అయిన్‌ అక్షరంతో మొదలవుతుంది. కాబట్టి లోగో మధ్యలో ఆ అక్షరం పెట్టాలని కోరారు.) ఇరుపక్కలా ఉస్మానియా యూనివర్సిటీ అని ఇంగ్లిషులో ఉంటుంది. కింది భాగంలో కుడివైపు జామియా అని, ఎడమవైపు ఉస్మానియా అని అరబ్బీలో రాసి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement