సూర్యుడు, భూమి మధ్యలో బుధుడు!
నేడు ఖగోళంలో అరుదైన ఘటన
♦ సాయంత్రం 4.42 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు వీక్షించే అవకాశం
♦ మళ్లీ వీక్షించాలంటే 2032 నవంబర్ 13 వరకు ఆగాల్సిందే
♦ నేరుగా చూడడం ప్రమాదకరం..సోలార్ ఫిల్టర్లు వాడాలని నిపుణుల సూచన
హైదరాబాద్: సూర్యుడిని అత్యంత వేగంతో చుట్టేసే బుధగ్రహం సోమవారం భూమికి, సూర్యుడికి మధ్య అడ్డుగా రానుంది. ఒక రకంగా చెప్పాలంటే సూర్య గ్రహణాన్ని సృష్టించనుంది. కానీ అంతపెద్ద సూర్యుడికి దగ్గరగా పరిభ్రమిస్తుండడంతో... సూర్యుడిపై ఓ చిన్న నల్లని చుక్కలాగా కనిపించనుంది. అరుదైన ఈ ఖగోళ విశేషాన్ని సోమవారం సాయంత్రం 4.42 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు వీక్షించే అవకాశముంది. అయితే దీనిని నేరుగా వీక్షించడం ప్రమాదకరం. తగిన పరికరాలు, నిపుణుల సూచనల ప్రకారం చూడొచ్చు.
సూర్యుడు, బుధుడు, భూమి ఒకే సరళరేఖలో..
సోమవారం సాయంత్రం సూర్యుడు, బుధుడు, భూమి ఒకే సరళరేఖపైకి రానున్నాయి. సూర్యుడికి, భూమికి మధ్య బుధ గ్రహం వస్తుంది. దీనినే ‘ట్రాన్సిట్ ఆఫ్ మెర్క్యూరీ’ అని పేర్కొంటారు. ఈ దృశ్యాన్ని నేరుగా చూడడం కళ్లకు ప్రమాదకరం. కేవలం సోలార్ ఫిల్టర్‌లో మాత్రమే చూడాలి. అదేవిధంగా బైనాక్యూలర్లు, టెలిస్కోప్‌ల ద్వారా సూర్యుడి ప్రతిబింబం గోడపై పడేలా చేసి.. సూర్యుడిని బుధగ్రహం దాటడాన్ని గమనించవచ్చు. ఇక ఈ ఖగోళ విశేషం కారణంగా భూమిపైగానీ, జీవరాశిపైగానీ ఎటువంటి ప్రభావమూ ఉండదు.
వందేళ్లలో 13వ సారి..: గత వందేళ్ల కాలంలో 13 సార్లు మాత్రమే సూర్యుడిపై నుంచి బుధుడు వెళ్లే దృశ్యం కనిపించిందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డెరైక్టర్ ఎన్.రఘునందన్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఆదివారం ఆయన ఈ ఖగోళ విశేషం వివరాలను వెల్లడించారు. ఇలాంటి ఘటన 2006 నవంబర్ 8న జరిగిందన్నారు. ఇక ముందుకూడా 2019 నవంబర్ 11న సంభవించనుందని.. కానీ అప్పుడు మన దేశంలో కనిపించదని తెలిపారు. అయితే ఆ తర్వాత 2032 నవంబర్ 13న జరిగే ‘బుధ’ సూర్యగ్రహణం మనదేశంలో కనిపిస్తుందన్నారు. అంటే సోమవారం ఈ దృశ్యాన్ని చూడనివారు.. మళ్లీ చూడాలంటే మరో 16 ఏళ్ల పాటు వేచి ఉండాల్సిందేనని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ కోరికపై రంజోల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 250 మంది, కొండాపూర్ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో మరో 250 మంది విద్యార్థులు ఈ ఘటనను తిలకించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.