సన్‌డే... | Sunday ... summer | Sakshi
Sakshi News home page

సన్‌డే...

Published Mon, Apr 4 2016 4:50 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

సన్‌డే...

సన్‌డే...

పెరిగిన ఎండలు
41.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు

 

సిటీబ్యూరో: నగరంలో ఎండలు భగ్గుమంటున్నాయి. పగటిపూట నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఆదివారం నగరంలో గరిష్టంగా 41.3 డిగ్రీలు, కనిష్టంగా 26.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమి, ఉక్కపోత తట్టుకోలేక వృద్ధులు, చిన్నారులు అల్లాడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికే జనం జంకుతున్నారు. రోడ్లవెంట నివసించే యాచకులు, అనాథలు, ఇతర ప్రయాణికుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎండల తీవ్రత అతిగా ఉంటే...అతినీల లోహిత కిరణాల వల్ల ముఖ సౌందర్యం దెబ్బతినడంతో పాటు చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు  పగటిపూట బయటికి వెళ్లక పోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. ఎండలు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని ఆయా రంగాల నిపుణులు సూచిస్తున్నారు. 


కొబ్బరి నీళ్లు..మజ్జిగ...
వేసవిలో రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు లీటర్ల నీరు తాగాలి. పోటాషియం, సోడియం లెవల్స్ పడిపోతే వడదెబ్బకు గురవుతారు. వేడికి తట్టుకోలేక తాగే కూల్‌డ్రింక్స్ ఆరోగ్యాన్ని హరిస్తాయి. వీటిలోని ఫాస్పేట్ పదార్థంతో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది. దాహం వేయకపోయినా నీళ్లు కొంచెం కొంచెం తాగడం వల్ల డీహైడ్రేషన్ భారీ నుంచి కాపాడుకోవచ్చు. కొబ్బరినీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, పుచ్చకాయ రసం వంటివి మంచినీళ్లకు ప్రత్యామ్నాయంగా ఉపకరిస్తాయి. - డాక్టర్ సమి, అపోలో ఆస్పత్రి, డీఆర్‌డీఓ


ఎండలో ఆడనివ్వకూడదు..
చిన్నారుల శరీరంలో 50 శాతం నీరే ఉంటుంది. ఎండ  దెబ్బకు నీటి శాతం తగ్గడం వల్ల చిన్నారులు వడదెబ్బకు గురవుతారు. త ద్వారా తలనొప్పి, వాంతులు, విరేచనాల వంటి సమస్యలు రావచ్చు. వేసవి సెలవుల కారణంగా ఆటపాటలు ఎక్కువవడం సహ జం. దీనికి ఎండ తోడవడం వల్ల విపరీతమైన అలసటకు గురవుతారు. నీటి పరిమాణం ఎక్కువుండే పుచ్చకాయ, స్ట్రాబెర్రీ వంటి వి అందించాలి. మధ్యాహ్నం సమయంలో నీడలో ఉండేలా చూడాలి. బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకునేలా చూడాలి. ఆహారంగా ఆమ్లెట్‌కు బదులు ఉడకబెట్టిన గుడ్డు, కోల్డ్ మిల్క్ వంటివి అందించాలి.  - డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, చిన్నపిల్లల వైద్యనిపుణుడు, నిలోఫర్


కుక్కలకు దూరంగా ఉండాలి
పగటి ఉష్ణోగ్రతలు వీధి కుక్కలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. సరిపడు ఆహారం, మంచి నీరులేమితో పాటు మండుతున్న ఎండలు వీటికి పిచ్చెక్కిస్తున్నాయి. కుక్కలకు వేట సహజ లక్షణం. ఈ లక్షణమే వాటిని చిన్నారులు, వాహనదారులపై ఉసికొల్పుతుంది. ఇలా ఫీవర్ ఆస్పత్రిలో రోజు సగటున 35 కుక్కకాటు కేసులు నమోదు అవుతున్నాయి. కాబట్టి కుక్కలకు దూరంగా ఉండాలి. వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలను కుక్కలకు దూరంగా ఉంచాలి.  - డాక్టర్ గోవర్థన్, జనరల్ ఫిజీషియన్, కేర్ ఆస్పత్రి


మసాల ఫుడ్డు వద్దు
పాలు, పాల పదార్థాలతో తయారు చేసిన లస్సీలు కాకుండా ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం తాగాలి. ద్రవపదార్థాలు అధికం గా ఉండే పుచ్చ, కర్బూజా, ద్రాక్ష, మామిడి పండ్లు, ముంజలు వంటివి తీసుకోవాలి. రోడ్ల వెంట ఐస్‌తో తయారు చేసిన రంగు నీళ్లకు బదులు కొబ్బరి నీళ్లు తాగాలి. మసాలాలు ఉన్న ఆహారం వద్దు. తేలికగా జీర్ణం అయ్యేవి తీసుకోవాలి. వడదెబ్బ తగిలి సొమ్మ సిల్లిన వ్యక్తులను కూర్చో బెట్టకూడదు. నీడకు తరలించి ఏదైనా నునుపైన బల్లపై కానీ మంచంపై కానీ పడుకోబెట్టాలి. నూలుతో తయారు చేసిన తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. స్పృహలోకి వచ్చిన తర్వాత చల్లటి మంచి నీరు, సోడా, కోబ్బరి నీళ్లు, మజ్జిగ తాగించాలి. - డాక్టర్ రవిశంకర్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సన్‌షైన్

 
స్కిన్ గ్లో తగ్గకుండా...

చెమటపొక్కుల్ని గోళ్లతో గిల్లడం వంటివి చేస్తే ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎండలకు సెగ గడ్డలు అయ్యే అవకాశం ఎక్కువ. యాంటి బ్యాక్టీరియల్ సోప్‌తో వీటిని శుభ్రం చేసుకోవాలి. గాఢమైన రంగులున్న దుస్తులు కాకుండా తేలి కైన తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి. పట్టినట్టుండే దుసు ్తలు కాకుండా వదులైన పలుచని దుస్తులు వేసుకోవాలి. బయటికి వెళ్లేప్పుడు తలకు క్యాప్ అలవాటు చేసుకోవాలి. బయటికి వెళ్లి వచ్చిన తర్వాత సాయంత్రం వేళలో చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇంటి తలుపులు, కిటికీలకు గోనె సంచులను అమర్చి, వాటిని నీటితో తడపాలి. - ప్రొఫెసర్ మన్మోహన్, చర్మవైద్య నిపుణుడు, ఉస్మానియా ఆస్పత్రి


సర్వేంద్రియానాం...‘నయనం’...
మండుతున్న ఎండలు కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి. డీహైడ్రేషన్ వల్ల కళ్లు ఎర్రబడి, మంట పుట్టిస్తాయి. పగలు నేరుగా సూర్యుని వైపు చూడకూడదు. వైద్యుడి సూచన మేరకు కళ్లకు ఎలాంటి హానీ చేయని కంటి అద్దాలను ఎంపిక చేసుకోవాలి. ఏవీ పడితే అవి కాకుండా బ్రాండెడ్ కంపెనీలకు చెందిన కళ్లజోళ్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఫొటోగ్రే, ఫొటో థింక్, ఫొటో బ్రౌన్ లెన్స్ అద్దాలను వాడటం ఉత్తమం.  - డాక్టర్ రవీందర్‌గౌడ్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement