భార్యే చంపించింది
ఆస్తి కోసం ప్రియుడితో కలిసి సుపారీ హత్య ఐదుగురి అరెస్టు
ముషీరాబాద్: గాంధీనగర్‌లో గత డి సెంబర్ 27న జరిగిన సుశీల్ చక్రవర్తి హత్య కేసును ముషీరాబాద్ పోలీసులు ఛేదించారు. భర్త ఆస్తిపై కన్నేసిన భార్యే ప్రియుడితో కలిసి సుపారీ హత్య చేయించిందని నిర్థారించారు. ఆమెతో పాటు మరో నలుగురిని మంగళవారం అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం... గాంధీనగర్‌లోని నారాయణ ఎన్‌క్లేవ్‌లో ఉండే మారిశెట్టి సుశీల్ చక్రవర్తి (41) ఒంటరిగా ఉంటున్నాడు. ఇతనికి మౌలాలి అంబిక అపార్ట్‌మెంట్‌లో ఉండే జయరాజ కుసుమకుమారితో 1996లో పెళ్లైంది.
వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కాగా, 2012లో భర్త ప్రవర్తనతో విసుగు చెందానని, అతని మానసిక ప్రవర్తన సరిగా లేదని పేర్కొంటూ కుమారి భర్త దగ్గర నుంచి ఇద్దరు పిల్లలును తీసుకొని మౌలాలిలోని తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. గాంధీనగర్‌లో భర్త దగ్గర ఉన్న సమయంలోనే అదే భవనంలో కిరాయికి ఉంటున్న లంక నరేష్‌కుమార్ అలియాస్ బబ్లూతో(26)తో ఈమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. గుంటూరుజిల్లా మంగళగిరి మండలం కృష్ణపాలెంకు చెందిన నరేష్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. తల్లిగారి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా కుమారి ప్రియుడితో సంబంధాన్ని కొనసాగిస్తోంది. వీరిద్దరూ భర్త సుశీల్ చక్రవర్తి అడ్డు తొలగించాలని, ఆపై అతని ఆస్తి కాజేయాలని నిర్ణయించుకున్నారు.
నరేష్ మాల్లాపూర్‌లో ఉండే ఓరుగంటి బాల్‌రాజ్(24), పూసల రాజు(22), షేక్ గౌష్(30)లను సంప్రదించాడు. సుశీల్‌ను హత్య చేస్తే రూ. 2 లక్షల సుపారీ ఇస్తానని ఒప్పుకున్నాడు. డిసెంబర్ 16న కుమారి, ప్రియుడు నరేష్‌తో పాటు సుపారీ మాట్లాడుకున్న ముగ్గురూ మౌలాలిలోని ఒక రూమ్‌లో కలుసుకున్నారు. కుమారి తన భర్తను ఎలా హత్య చేయాలో వారికి వివరించారు. 18న నరేష్‌కుమార్, పూస రాజు కలిసి సుశీల్ ఇంటికి వచ్చి రెక్కీ నిర్వహించారు. 19న మరోసారి కిరాయి హంతకుడు బాల్‌రాజ్‌ను తీసుకువచ్చి ఇంటిని చూపించారు.
20వ తేదీన నలుగురు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో స్కూడ్రైవర్, సుత్తి, ఇతర మారాణాయుధాలు కొనుక్కొని, మద్యం తాగి సుశీల్ చక్రవర్తి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే, ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇద్దరు ఇంట్లోనే ఉండి, మరో ఇద్దరు బయట కాపలా ఉన్నారు. సాయంత్రం 5.30కి సుశీల్ ఇంట్లోకి రాగానే అతిదారుణంగా చంపేశారు. కాగా, కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్య కుమారిపై అనుమానంతో తమదైన శైలిలో విచారించగా ప్రియుడితో కలిసి సుపారీ హత్య చేయించినట్టు ఒప్పుకుంది. దీంతో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.