టీ హబ్‌లో స్టార్టప్‌ల జోరు
♦ 140 స్టార్టప్ కంపెనీల కార్యకలాపాలు షురూ
♦ నెల రోజుల్లో రంగంలోకి మరో 60 స్టార్టప్‌లు
♦ పని వాతావరణం బాగుందని నిపుణుల కితాబు
♦ ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక రంగంలో నూత న ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చే ఔత్సాహికులకు వేదికగా నిలిచేందుకు ఏర్పడిన టీ హబ్ క్యాటలిస్ట్ భవనంలో స్టార్టప్ కంపెనీల కార్యకలాపాలు జోరందుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నవంబర్ 5న ప్రారంభమైన టీ హబ్‌లో సాఫ్ట్‌వేర్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఈ-కామర్స్, అడ్వర్టైజింగ్, సర్వీస్ ప్రొవైడర్స్ వంటి వినూత్న సేవలందించే స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ హంగులతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఐదంతస్తుల్లో నెలకొల్పిన ఈ భవనంలో ప్రతీదీ విశేషమే. సుమారు 200 స్టార్టప్‌లు కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉండగా ప్రస్తుతానికి 140 కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి. మరో నెల రోజుల్లో 60 స్టార్టప్‌లు సేవలు ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో టీ హబ్‌లో స్టార్టప్‌ల పనితీరు గురించి తెలుసుకునేందుకు స్టార్టప్‌ల యజమానులు, ఉద్యోగులను ‘సాక్షి’ పలకరించింది. ఇక్కడి పని వాతావరణం, సాంకేతిక నిపుణులకు అందుతున్న సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకుంది.
త్వరలో రెండో దశ..?
మొదటి దశ టీ-హబ్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇదే స్ఫూర్తితో రెండో దశ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాయదుర్గం ఇనార్బిట్ మాల్ సమీపంలో సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న భవనంలో టీహబ్ రెండో దశను ప్రారంభించనున్నట్లుఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపా రు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ నెల 28న టీ-హబ్‌ను సందర్శించే అవకాశం ఉందన్నా రు. కాగా, స్టార్టప్‌లు పెట్టాలనుకునేవారికి అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నామని, రిజిస్ట్రేషన్ నుంచి పనులు మొదలుపెట్టే వరకు వారి వెన్నంటి ఉండి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నామని టీ హబ్ ఇన్‌చార్జి శ్రీనివాస్ కొల్లిపర వివరించారు.
ఏం జరుగుతోంది..?
► నూతన ఆలోచనలతో స్టార్టప్‌లు పెట్టేలా ప్రోత్సహించడం
► సదస్సులు, చర్చల ద్వారా స్టార్టప్‌ల పరిధి విస్తరించడం
► ఇతర దేశాల స్టార్టప్‌లనూ ఆకర్షించడం
► ఐటీ, వివిధ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో మెరుగైన ఫలితాల సాధన
► అనుమతులు,పేటెంట్‌లు పొందేందుకు సహకారం
► స్టార్టప్‌లకు అవసరమైన వనరులన్నీ ఒకేచోట అందుబాటులో ఉంచడం
మరికొన్ని ప్రత్యేకతలు...
విద్యుత్, నీరు పొదుపుగా వినియోగించేలా ఇందులో ఏర్పాట్లున్నాయి. ఉద్యోగులు లోనికి వచ్చేటప్పుడు లైట్లు వెలగడం.. బయటకు వెళ్లగానే ఆరిపోయేలా సెన్సార్లున్నాయి. భవనం వెలుపలి అద్దాలు 95 శాతం వేడిని బయటే నిరోధిస్తాయి. బల్లలు, కుర్చీలు అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు.
సిలికాన్ వ్యాలీని తలపిస్తోంది
టీ-హబ్ సిలికాన్ వ్యా లీని తలపిస్తోంది. వస తులు అంతర్జాతీయ ప్ర మాణాలతో ఉన్నాయి. ప్రస్తుతం మా స్టార్టప్‌లో 18 మంది ఉన్నారు. వివాహాది శుభకార్యాల నిర్వాహకులకు సకల సేవలను ఒకే గవాక్షం ద్వారా అందించే ప్రోగ్రామ్ సిద్ధం చేస్తున్నాం.
- ప్రణవ్ (గుజరాత్), ఫ్లాట్ పెబుల్ స్టార్టప్
టీ హబ్ గురించి యజమానులు, ఉద్యోగులు ఏం చెప్పారంటే..
చక్కని పని వాతావరణం
టీ-హబ్‌లో సృజనాత్మకంగా పనిచేసుకునేం దుకు అనువైన వాతావరణముంది. నూతన సాఫ్ట్‌వేర్ సృష్టించే పనిలో నిమగ్నమయ్యాం. మా ఆలోచనలను ఆవిష్కరించేందుకు సరైన మార్గదర్శకులు, నిపుణులు అందుబాటులో ఉన్నారు.
- వెంకీ (చెన్నై), అక్యూరా స్టార్టప్
అవకాశాల స్వర్గం
నేను సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాను. భవిష్యత్‌లో నాకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. మెంటర్లు, ఇన్వెస్టర్లు ఇక్కడే ఉండటంతో మా ఆవిష్కరణలకు ఆకాశమే హద్దుగా భావిస్తున్నా.
- విశాల్(అహ్మదాబాద్), క్యూ8 సాఫ్ట్‌వేర్ స్టార్టప్
సహకారం బాగుంది
టీ-హబ్‌లో పనిచేసుకునేందుకు అందరి సహా య సహకారాలు లభిస్తున్నాయి. ఆరుగురున్న బృందం ఆన్‌లైన్‌లో యాడ్స్ ఇచ్చే సంస్థలకు నూతన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నాము. మా సంస్థకు అమెరికా నుంచి బెస్ట్ సెర్చ్ అవార్డు దక్కింది.
- గీతాంజలి(యూపీ), ఆప్టిమైజర్ స్టార్టప్
ఉత్సాహం నింపుతోంది...
మా స్టార్టప్‌లో 13 మంది పనిచేస్తున్నారు. మా సంస్థ 30 దేశాల్లో సేవలందిస్తోంది. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను రూ పొందిస్తున్నాం. ఇక్కడి వాతావరణం ఉత్సాహంగా ఉంది.
- మెహర్(అమెరికా), స్కిల్‌ఓ సాఫ్ట్‌వేర్