
తలసాని ఇంటి వద్ద కోలాహలం
తల్లి ఆశీర్వాదం తీసుకుని ప్రమాణ స్వీకారానికి వెళ్లిన శ్రీనివాస్
తరలివెళ్లిన నాయకులు, కార్యకర్తలు
రాంగోపాల్‌పేట్: సీఎం కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి పరిసరాలు మంగళవారం ఉదయం సందడిగా మారాయి. వందలాది మంది కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుని అభినందనలు తెలిపారు. ఇంటి ముందు టపాకాయలు కాలుస్తూ అభిమానులు ఆనందాన్ని పంచుకున్నారు. రోడ్లఫై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీ మయం చేశారు. ప్రమాణ స్వీకారానికి తరలి వెళుతుండగా మారేడుపల్లిలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత తలసాని మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. అంతకుముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తలసాని మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు మంత్రి పదవి ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంత కాలం సహకరించిన గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల ప్రజలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని చెప్పారు.
తల్లి ఆశీర్వాదం తీసుకుని...
ఉదయం 8.45 గంటలకు తల్లి లలితాబాయి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం తలసాని ప్రమాణ స్వీకారానికి బయలుదేరారు.
చంద్రబాబు పెద్ద కొడుకు: లలితాబాయి
తన కుమారుడు ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాడని... ఆయన కష్టానికి ఫలితం లభిస్తోందని తలసాని తల్లి లలితాబాయి అన్నారు. తనకు చంద్రబాబునాయుడు పెద్ద కొడుకులాంటివాడని, తలసాని చిన్నకొడుకని... ఇద్దరూ విడిపోతుండటం బాధగా ఉందని అన్నారు.
తరలి వెళ్లిన కార్యకర్తలు
తలసాని ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లారు. రాంగోపాల్‌పేట్ డివిజన్ నుంచి నాగేందర్ ఆధ్వర్యంలో బండిమెట్, ప్యారడైజ్, మంజు థియేటర్ నుంచి మూడు బృందాలుగా వెళ్లారు. మిగతా డివిజన్ల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పయనమయ్యారు.
అభిమానుల సందడి
సోమాజిగూడ: తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణను పురస్కరించుకొని మంగళవారం రాజ్‌భవన్ రోడ్, సీఎం క్యాంపు కార్యాలయం ప్రాంతం గులాబీమయంగా మారిపోయింది. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు తదితరుల చిత్రపటాలు, ఫ్లెక్సీలను అభిమానులు పెద్దసంఖ్యలో ఏర్పాటు చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. రాజ్‌భవన్ రోడ్‌లో రాకపోకలపై పోలీసులు నియంత్రణ విధించడంతో బేగంపేట, పంజగుట్ట ప్రదాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.