ప్రతిభకే పట్టం | Talents to be crowned | Sakshi
Sakshi News home page

ప్రతిభకే పట్టం

Published Thu, Jul 6 2017 1:53 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

ప్రతిభకే పట్టం - Sakshi

ప్రతిభకే పట్టం

- అన్ని ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లకు ఉమ్మడి కౌన్సెలింగ్‌
నీట్‌ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు
ప్రవేశాల మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో అందుబాటులో 3,150 ఎంబీబీఎస్, 1,140 బీడీఎస్‌ సీట్లు  
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్‌ వైద్య సీట్లన్నింటినీ ‘జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)’ర్యాంకు ఆధారంగానే భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం మార్గదర్శకాలతో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రవేశాల ప్రక్రియ బాధ్యతలను కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం చేపడుతుంది.
 
50 శాతం అందరికీ..
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో కలిపి 3,250 ఎంబీబీఎస్‌ సీట్లు, 1,140 బీడీఎస్‌ సీట్లు ఉన్నాయి. తాజా మార్గదర్శకాల ప్రకారం నీట్‌ మెరిట్‌ ఆధారంగానే అన్ని సీట్లనూ భర్తీ చేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్లను, ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేస్తారు. ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లోని మిగతా 50 శాతం సీట్లను ‘ఓపెన్‌ టు ఆల్‌’విధానంలో భర్తీ చేస్తారు. అంటే స్థానికత, రిజర్వేషన్లు వంటివి ఈ సీట్లకు వర్తించవు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర విద్యార్థులైనా ఈ సీట్లకు పోటీ పడే అవకాశం ఉంటుంది. కాళోజీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్, ప్రైవేటు కాలేజీల ప్రతినిధి ఒకరు ఉండే కమిటీ ఈ 50 శాతం సీట్ల భర్తీ ప్రక్రియను నిర్వహిస్తుంది.
 
ఫీజులలో మార్పులు లేవు..
వైద్యవిద్య కోర్సులకు గతేడాదే ఫీజులు పెంచిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మార్పులు చేయలేదు. వైద్య విద్య డిగ్రీ కోర్సుల్లో కన్వీనర్‌ (ఏ), యాజమాన్య (బీ), ప్రవాస భారతీయ (సీ) కోటాలు ఉంటాయి. కన్వీనర్‌ కోటాలో భర్తీ చేసే 50 శాతం సీట్లకు రూ.60 వేలు ఫీజు ఉంది. యాజమాన్య కోటాలో భర్తీ చేసే 35 శాతం సీట్లకు రూ.11 లక్షలుగా ఉండగా.. 15 శాతం ఉండే సీ కేటగిరీ సీట్లకు మాత్రం యాజమాన్య కోటాకు రెట్టింపు (రూ. 22 లక్షలు)గా ఉంది. ఇక మైనారిటీ కాలేజీల్లోని ఏ కేటగిరీకి రూ.60 వేలు, బీ కేటగిరీకి రూ.14 లక్షలు, సీ కేటగిరీ సీట్లకు రూ.28 లక్షలు ఫీజు ఉంది. ఇక బీడీఎస్‌ కోర్సులకు సంబంధించి... ప్రైవేటు కాలేజీల్లో ఏ కేటగిరీకి రూ.45 వేలు, బీ కేటగిరీకి రూ.4 లక్షలు, సీ కేటగిరీ సీట్లకు రూ.5 లక్షలుగా ఫీజు ఉంది. ప్రైవేటు మైనారిటీ కాలేజీల్లో ఏ కేటగిరీకి రూ.45 వేలు, బీ కేటగిరీకి రూ.2.7 లక్షలు, సీ కేటగిరీ సీట్లకు రూ.2.7 లక్షల ఫీజు ఉంది. తాజా విద్యా సంవత్సరంలోనూ ఇవే ఫీజులు ఉండనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement