పాదయాత్రకు రక్షణ ఏర్పాట్లు చేయాలి
సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
సాక్షి, హైదరాబాద్: మహాజన పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస సహకారం కూడా లభించడం లేదని సీపీఎం విమర్శించింది. సీపీఎం చేపట్టిన ఈ పాదయాత్ర గురించి సీఎం కేసీఆర్‌కు, పోలీసు ఉన్నతాధికారులకు ముం దుగానే తెలియజేసి అనుమతులు తీసుకుని రూట్‌మ్యాప్ ఇచ్చినా పోలీసులు కనీస భద్రత కల్పించకపోవడం విచారకరమని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో తమ పాదయాత్ర బృందంపైకి ఒక లారీ దూసుకొచ్చి ముగ్గురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక లేఖ రాస్తూ పాదయాత్ర విషయం ప్రకటించగానే తన గన్‌మెన్లను ప్రభుత్వం ఉప సంహరించుకుందని పేర్కొన్నారు.
ఇది తగదని లేఖలు రాసినా, అర్జీలు పెట్టినా రెండు నెలలుగా ఆ ఫైలు పెండింగ్‌లోనే ఉందని తెలిపారు. ఈ లేఖ ప్రతిని డీజీపీ అనురాగ్‌శర్మకు పంపించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు లేవుగాని, కేసీఆర్ మాత్రం రూ. 50 కోట్లతో 150 గదుల భవనాన్ని నిర్మించుకున్నారని వీరభద్రం విమర్శించారు. తమ్మినేని నేతృత్వంలోని మహాజన పాదయాత్ర బుధవారం ఆదిలాబాద్‌కు చేరుకోగా, కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రజలను మోసం చేశారన్నారు. పాదయాత్రకు ప్రభుత్వం నుంచి రక్షణ ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌కు సీపీఎం నేత బి.వెంకట్ మరో లేఖ రాశారు.