మార్పు కోసం ఐక్య ఉద్యమాలే శరణ్యం
మహాజన పాదయాత్ర సభలో తమ్మినేని
సాక్షి, సూర్యాపేట: ‘పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో పేదవాడు.. పేదవాడిగానే.. సంపన్నుడు.. మరింత సం పన్నుడుగా మారుతున్నాడు. తెలంగాణ ముఖచిత్రం మార్చాలంటే రాజకీయాలకతీతంగా సామాజిక న్యాయం కోసం ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరముంది’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మహాజన పాదయాత్రలో భాగంగా బుధవారం సూర్యాపేట గాంధీపార్కులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు రోజుకో తీరుగా మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 19న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభకు గద్దర్, విమలక్క, కోదండరాం, సామాజిక సంఘాలు, రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు నిత్యం సేవ చేస్తున్న మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎంను తమ్మినేని కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. మున్సిపల్ కార్మికులకు 3,4 నెల లకోసారి కాకుండా ప్రతినెలా వేతనాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు.