కొత్త రాష్ట్రంలోనూ పాత పాలనే
తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్: కొత్త రాష్ట్రంలోనూ పాత పాలనే సాగుతోందని, ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పులు రాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ కాకుండా బతుకు తెలంగాణ కోసం కృషి చేయాలని సూచించా రు. మహాజన పాదయాత్ర శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తమ్మినేని మాట్లాడుతూ పాదయాత్రలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలు చెబుతుంటే కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కావడంలేదని అర్థమవుతోందన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికీ సామాజిక న్యాయం అందడం లేదన్నారు. వెనుకంజలో ఉన్న అన్ని కులాలవారికి విద్య, వైద్యం, ఉపాధి, ఇతర సౌకర్యాలు కల్పించి, అభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రభుత్వాలు వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని ఆరోపించారు. వాస్తు పేరుతో కొత్తగా ఉన్న భవనాలు కూల్చి ప్రజాధనాన్ని వృథా చేయొద్దని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు.
తమ్మినేనికి రేవంత్ ఫోన్
పాదయాత్రలో ఉన్న తమ్మినేనికి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి శుక్రవారం ఫోన్ చేశారు. పాదయాత్ర జరుగుతున్న తీరును, ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 1న టీటీడీపీ అగ్రనేతలతో కలసి మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట వద్ద నుంచి పాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు. ఈ మేరకు టీడీపీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నామన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం సీపీఎం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉంటామని చెప్పారు.
వేధింపులు ఆపండి: న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న హోంగార్డులపై వేధింపులు ఆపాలని, నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులను ఎత్తేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే లాఠీలతో చితకబాదడం గర్హనీయమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న హోంగార్డులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, 2004కు ముందు విధుల్లో చేరిన వారికి అప్పటి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని శుక్రవారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు.