ఎన్నికల వాగ్దానాల అమలేది?: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉలుకుపలుకు లేకుండా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రత్యామ్నాయం లేక ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లేశారన్నారు. ఈ నెల 17న తలపెట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్‌కు చేరింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పాదయాత్రకు ప్రజా స్పందన బాగుందన్నారు. ప్రజలు తనకు తెలియ చెబుతున్న సమస్యలపై ప్రతిరోజు సీఎంకు లేఖ రాస్తున్నానన్నారు.
ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో ముఖ్యమైన దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, విద్యార్థులకు కేజీ టూ పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం.. ఇవన్నీ ఎక్కడా అమలైన దాఖలాలు లేవని ఆరోపించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటుపరమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వం భూములు పంచకుంటే తామే ఆక్రమించి ప్రజలకు పంచుతామన్నారు.
సీఎంకు తమ్మినేని లేఖ: కొత్త జిల్లాల ఏర్పాటుకు రాని అడ్డంకి కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ఏమొచ్చిందో ప్రభుత్వం స్పష్టం చేయాలని, గిరిజనులకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్‌ను ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని సీఎంకు రాసిన లేఖలో తమ్మినేని పేర్కొన్నారు.