టార్గెట్ టాప్ కేడరే!
అగ్రనేతలను మట్టుబెడితే ఉద్యమాన్ని నీరుగార్చవచ్చనే యోచన
- వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఎస్‌ఐబీ విభాగం
- ఒక్కో కీలక నేత వేట కోసం ఒక్కో బృందం
- ప్రధానంగా పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీల సభ్యులపై దృష్టి
- బలమైన ఇన్‌ఫార్మర్ వ్యవస్థ.. భారీగా నజరానాలు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరోతోపాటు కేంద్ర, రాష్ట్ర కమిటీల్లోని కీలక నేతలను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారా.. వారిని మట్టుబెట్టేందుకు ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టారా.. ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. మావోయిస్టు అగ్రనేతల్ని హతమార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీ సులు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపారని సమాచారం. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉదయ్ సహా పలువురు కీలక నేతలు ఏవోబీలో ఎన్‌కౌంటర్ అయ్యారు. మావోయిస్టు పార్టీకి తెలుగువారు నేతృత్వం వహిస్తున్నట్లుగానే ఆ పార్టీ అగ్రనేతలను పట్టుకోవడంలో తెలుగు రాష్ట్రాల పోలీసులదే కీలక భూమిక. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో మావోయిస్టు నేతలను అరెస్టు చేసినా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక పోలీసుల పాత్ర ఉంటోంది.
ఎస్‌ఐబీ కీలకం..: మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో గ్రేహౌండ్స్ పేరుగాంచిన విధంగానే సమాచార సేకరణలో స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) కీలకంగా వ్యవహరిస్తోంది. మావోయిస్టు పార్టీలోని మొదటి తరం నేతలను మట్టుపెట్టడం ద్వారా ఆ ఉద్యమాన్ని కూకటివేళ్లతో పెకలించవచ్చనేది ఎస్‌ఐబీ వ్యూహంగా కనిపిస్తోంది. అందువల్లే మావోయిస్టు అగ్ర, కీలక నేతల వేట కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. మావోయిస్టు పార్టీ రాజకీయ విభాగాలైన పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీల్లో ఉన్న నేతల కోసం నిఘా పెట్టింది. ఒక మావోయిస్టు నేత కోసం ఏర్పాటు చేసిన బృందం ఆ నేత ఎన్‌కౌంటర్ అయ్యేవరకు ఆ ఒక్క పనిమీదే ఉంటోందని తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ లేదా అరెస్టు జరిగితేనే ఆ ప్రత్యేక బృందం ఆపరేషన్ పూర్తయినట్లుగా పరిగణిస్తున్నారు. ఈ ప్రత్యేక బృందాల కారణంగానే పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారనే వాదన కూడా ఉంది.
బలమైన ఇన్‌ఫార్మర్ వ్యవస్థ
మావోయిస్టు నేతల వేటలో భాగంగా వారి షెల్టర్/శిక్షణ జోన్లుగా ఉన్న ప్రాంతాల్ని ఎస్‌ఐబీ పోలీసులు ఇప్పటికే గుర్తించారని తెలిసింది. బలమైన ఇన్‌ఫార్మర్, కోవర్టు వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంలోనూ పోలీసులు సఫలమయ్యారు. షెల్టర్లు, శిక్షణ ప్రాంతాల్లోని నేతలను కలిసే కొరియర్లను గుర్తించడం ద్వారా నీడలా వెంబడిస్తున్నారు. ముఖ్య నేతల కదలికల సమాచారాన్ని ఇస్తున్న ఇన్‌ఫార్మర్లకు రూ.లక్ష నుంచి రూ.పది లక్షల దాకా నజరానా అందిస్తున్నారని తెలుస్తోంది. ఆయా విభాగాలను పర్యవేక్షించే కీలక అధికారులకు మినహా ఇన్‌ఫార్మర్ల సమాచారాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మావోయిస్టు పార్టీతో గతంలో సంబంధాలు కలిగి ఉన్న వారు, ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో చిన్నచిన్న స్థాయిల్లో పనిచేస్తున్న వారు కూడా పోలీసు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తుండడంతో నేతల కదలికలను పసిగట్టడం సులువవుతోంది. వీటన్నింటికీ మించి సాంకేతిక నిఘా కోసం ఎస్‌ఐబీ పోలీసులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారని తెలిసింది. ఈ చర్యలన్నింటి ఫలితంగానే మావోయిస్టు పార్టీని వరుసగా దెబ్బకొడుతున్నారు.
అరెస్టయిన కీలక నేతలు
మావోయిస్టు పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు కోబాడ్ గాంధీ అలి యాస్ అరవింద్, బి.ప్రసాద్‌సింగ్ అలియాస్ బాల్‌రాజ్, అమిత్ బాగ్చి అలియాస్ సుమితి, కేంద్ర కమిటీ సభ్యులు పంకజ్, బన్సీధర్ సింగ్ అలియాస్ చింతన్‌దా, తుషార్‌కాంత్ భట్టాచార్య, రాజిరెడ్డి అలియాస్ సత్త న్న, వారణాసి సుబ్రమణ్యం అలియాస్ శ్రీకాంత్.
గత కొన్నేళ్లలో మరణించిన మావో అగ్ర నేతలు
కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఆజాద్, కేంద్ర కమిటీ సభ్యులు శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్‌రెడ్డి, వడ్కాపూర్ చంద్రమౌళి, సందె రాజమౌళి, కిషన్‌జీ, రాష్ట్ర కమిటీ సభ్యుడు సోలిపేట కొండల్‌రెడ్డి అలియాస్ రమణ.