లెక్క తేలాల్సిందే..! | Tax unpaid transportation vehicles on Special drive | Sakshi
Sakshi News home page

లెక్క తేలాల్సిందే..!

Published Sun, Sep 6 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

Tax unpaid transportation vehicles on Special drive

- పన్ను చెల్లించని రవాణా వాహనాలపై స్పెషల్ డ్రైవ్
- ఇంటింటి తనిఖీలకు  ఆర్టీఏ సన్నాహాలు
- ఫైనాన్సియర్లు, విద్యాసంస్థలపై ప్రత్యేక దృష్టి
- ‘సాక్షి’ కథనంతో కదిలిన ఆర్టీఏ
సాక్షి, సిటీబ్యూరో:
పన్ను చెల్లించని రవాణా వాహనాల లెక్క తేల్చేందుకు ఆర్టీఏ రంగంలోకి దిగింది. ఏకంగా ఇంటింటి తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం గ్రేటర్ పరిధిలో సుమారు 70 మందికి పైగా మోటారు వాహన ఇన్‌స్పెక్టర్లు, సహాయ తనిఖీ అధికారులు రంగంలోకి దిగారు. రెవిన్యూ మండలాల  వారీగా  పన్నులు చెల్లించని  మొండి వాహనాల జాబితాను సిద్ధం చేశారు. సుమారు రూ.200 కోట్ల వరకు పన్ను చెల్లించకుండా  తిరుగుతున్న వాహనాలపై ‘చేతులెత్తేసిన ఆర్టీఏ’  అనే శీర్షికన ఇటీవల  ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీంతో రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా పన్ను చెల్లించని వాహనాలపై మరింత దృష్టి సారించారు.

ఏ ఒక్క వాహనాన్ని కూడా వదిలిపెట్టకుండా  క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ  మేరకు  హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల  అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కేవలం రోడ్లపైన  కనిపించే వాహనాలు మాత్రమే కాకుండా ఇళ్ల వద్ద ఉండే రవాణా వాహనాలను కూడా తనిఖీ చేయాలని నిర్ణయించారు. రెండు జిల్లాల్లో కలిపి సుమారు లక్ష వరకు రవాణా వాహనాలు పన్ను చెల్లించకుండా ఉన్నట్లు  అంచనా. వీటిలో  2003 నుంచి ఇప్పటి వరకు చెల్లించకుండా ఉన్నవి కొన్నయితే, 2010 తరువాత పన్ను చెల్లించనివి మరి కొన్ని ఉన్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించకపోవడంతో భారీ సంఖ్యలో పెండింగ్ జాబితాలో పడిపోయాయి.
 
మండలాల వారీగా జాబితాలు..
నాన్ పేమెంట్ వాహనాల్లో ఎక్కువ శాతం ఫైనాన్షియర్ల చేతుల్లోనే ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. ఒక ఫైనాన్షియర్ నుంచి మరో ఫైనాన్షియర్‌కు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వాహనాలు  బదిలీ అయ్యాయి. ఈ క్రమంలో కొన్ని తుక్కు కింద మారాయి. ఇలా రకరకాల కారణాల వల్ల వేల సంఖ్యలో పన్ను చెల్లించకుండా  పేరుకుపోయాయి. మరోవైపు స్కూల్ బస్సులు, వస్తు రవాణా వాహనాలు కూడా ఒకరి నుంచి ఒకరికి చేతులు మారే క్రమంలో, కాలం చెల్లినవి తుక్కు కింద మారే క్రమంలో ఆ విషయం సంబంధిత ఆర్టీఏ  కార్యాలయంలో నమోదు కాకపోవడంతో పెండింగ్ జాబితా పెరిగినట్లు అధికారుల పరిశీనలో వెల్లడైంది. ఈ  క్రమంలో మనుగడలో ఉన్నవాటిపైనా లేని వాటిపైనా  కచ్చితమైన అవగాహన కోసం ఇళ్లు, కార్యాలయాలు, స్కూళ్లను కేంద్రంగా  చేసుకొని నిర్వహించే ప్రత్యేక తనిఖీలు దోహదం చేయగలవని  ఆర్టీఏ అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా రెండు జిలాలల్లోనూ మండలాల వారీగా జాబితాలను సిద్ధం చేసి స్పెషల్ డ్రైవ్‌కు చర్యలు  తీసుకుంటున్నారు.
 
తనిఖీల్లో పట్టుబడితే భారీ జరిమానా
పన్ను చెల్లించని వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ సూచించారు. ఒకవేళ ఇప్పటికే తమ వాహనాలు కాలం చెల్లిపోయి తుక్కు (స్క్రాప్) కింద మారినా ఆ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేయాలని పేర్కొన్నారు. అలా కాకుండా తాము నిర్వహించే  ప్రత్యేక తనిఖీల్లో వాహనాలు పట్టుబడితే  భారీ పెనాలిటీ చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు. చెల్లించవలసిన పన్ను మొత్తంపైన 200 శాతం వరకు అధికంగా జరిమానా ఉండవచ్చునని తెలిపారు.     
- జేటీసీ రఘునాథ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement