బూమెరాంగ్ అయిన టీడీపీ వ్యూహం
వైఎస్ఆర్‌సీపీ మీద లేనిపోని అభాండాలు వేయాలనుకున్న తెలుగుదేశం పార్టీ వేసిన వ్యూహం కాస్తా బూమెరాంగ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గట్టిగా పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీనిపై లేనిపోని దుష్ప్రచారం కల్పించడానికి తెలుగు దేశం పార్టీ శాయశక్తులా కృషి చేసింది. అందులో భాగంగానే.. వైఎస్ఆర్‌సీపీ సభ్యులు అసెంబ్లీ కార్యదర్శి మెడకు వైరు చుట్టారని, స్పీకర్ మీద పేపర్ బాల్స్ విసిరారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా చూపిస్తామంటూ.. ఒక వీడియోను ప్రదర్శించారు. అయితే అందులో టీడీపీ సభ్యులు చెప్పిన దృశ్యాలు ఏమీ లేవు. దాంతో.. ఉదయం మీరు ఆరోపించిన విషయాలకు సంబంధించిన విజువల్స్ ఏవని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే తమ దగ్గర ఇవే విజువల్స్ ఉన్నాయంటూ కొన్ని దృశ్యాలను మాత్రమే ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విడుదల చేశారు.
దీనిపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. ఏడాది క్రితం అడిగిన అసెంబ్లీ ఫుటేజి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని, అసెంబ్లీ సమావేశాల మొత్తం ఫుటేజి విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీ ఇష్టం వచ్చినట్లు ఎడిట్ చేసిన ఫుటేజి ఇవ్వడం సరికాదని చెప్పారు. పోడియం వద్ద నిరసన తెలపడం కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఆనవాయితీయేనని, పార్లమెంటులో కూడా ఇదే పరిస్థితి ఉందని చెవిరెడ్డి అన్నారు. రాజీనామాల వల్లే ప్రత్యేక హోదా వస్తుందనుకుంటే తామంతా రాజీనామా చేస్తామని ఆయన తెలిపారు.