నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు మంగళవారం ఉదయం నుంచి మళ్లీ ప్రారంభంకానున్నాయి. గత నెల 16న మొదలైన ఉభయ సభలు ఇప్పటికే పదహారు రోజుల పాటు జరిగాయి. ఈ నెల 6న సభ ముగిసిన అనంతరం స్పీకర్ సమావేశాలను 17వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
కాగా, రెండు రోజుల పాటే సమావేశాలు ఉంటాయని సచివాలయ వర్గాల సమాచారం. ఈనెల 18వ తేదీతో సమావేశాలను ముగించి, కేంద్ర బడ్జెట్ తర్వాత, రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను తిరిగి ఫిబ్రవరి చివరి వారంలో మొదలు పెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతీ రోజు ఒక లఘు చర్చ రూపంలో ప్రభుత్వం చర్చకు పెట్టింది. మంగళవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక హైదరాబాద్ అభివృద్ధిపై లఘు చర్చను చేపట్టనున్నారు.
అదే విధంగా బుధవారం (18వ తేదీ) ఎస్సీ, బీసీ సంక్షేమంపై లఘు చర్చ జరపాలని ఇప్పటికే షెడ్యూలు ఖరారైంది. దీంతో రెండు రోజుల పాటు సమావేశాలు జరిపి ముగించే వీలుందంటున్నారు. అయితే, మరో రెండు రోజుల పాటు సమావేశాలను పొడిగించే అవకాశముందని చెబుతున్నా, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.