పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నాం
హైదరాబాద్: కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై చర్చించారు. సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కరెన్సీ కొరత వల్ల ప్రజలు పడుతున్న సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. చిల్లర కొరత తీర్చాలని ఆర్బీఐకి లేఖ రాసినట్టు తెలిపారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 57,479 కోట్ల రూపాయల నగదు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని కేసీఆర్ చెప్పారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి 19,109 కోట్ల రూపాయల కరెన్సీ వచ్చినట్టు తెలిపారు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నామని, త‍్వరలో టీఎస్ వ్యాలెట్‌ను తీసుకొస్తామని చెప్పారు. సిద్ధిపేటను క్యాష్ లెస్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నోట్ల రద్దు విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, అసెంబ్లీలో కేంద్రాన్ని, ప్రధానిని విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందుల గురించి చర్చిస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, సామాన్యులు ఇబ్బందులు పడుతున్న మాట నిజమేనని చెప్పారు. ఈ చర్చలో ప్రతిపక్ష నేత జానారెడ్డి పాల్గొన్నారు.