దాన్ని బ్లాక్ మనీ అనొద్దు: కేసీఆర్
సామాన్యుల దగ్గర రెండున్నర లక్షలకు పైగా డబ్బులుంటే.. వాటిని బ్లాక్ మనీగా కాకుండా, లెక్కలోకి రాని నగదుగా పరిగణించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై ఆయన గురువారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు వల్ల వచ్చిన పరిస్థితిని ఫోన్లో వివరించారు. అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా కోరారు. దాంతో శుక్రవారం నాడు ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా కేసీఆర్‌కు మోదీ సూచించారు. అయితే పార్లమెంటు సమావేశాలు ఉన్నందువల్ల శనివారం ఆయన కేసీఆర్‌తో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోదీతో భేటీ సందర్భంగా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను లిఖితపూర్వకంగా ఆయనకు అందించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
ప్రధానంగా రిజిస్ట్రేషన్, రవాణా రంగాల్లో ఆదాయం భారీగా తగ్గిందని సమీక్ష సమావేశంలో కేసీఆర్ చెప్పారు. ఎక్సైజ్, సేల్స్ టాక్స్, కమర్షియల్ టాక్స్పైనా ప్రభావం కనిపిస్తోందన్నారు. సామాన్యులు, చిరు వ్యాపారులు ఈ నిర్ణయం వల్ల నష్టపోకుండా చూడాలని సూచించారు. రాష్ట్రాల ఆదాయాలు తగ్గినందున కేంద్రానికి చెల్లించాల్సిన అప్పులను వాయిదా వేయాలని ఆయన కోరారు. ఈ విషయాలన్నింటినీ తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు.