హైదరాబాద్ : తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజే ఏసీ) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం బుధవారమిక్కడ ప్రారంభమైంది. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో సమావేశం ఆరంభమైంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కోదండరాం వ్యాఖ్యలు, ఆయనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎదురు దాడి నేపథ్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశమైంది.
కాగా తెలంగాణ ఏర్పాటై రెండేళ్లవుతున్న నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలు, ఆచరణ, ప్రభుత్వ వైఫల్యాలపై లోతుగా అధ్యయనం చేయాలని టీజేఏసీ భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై అనుసరించాల్సిన వ్యూహంతో పాటు కోదండరాంపై టీఆర్‌ఎస్ నేతల విమర్శలను ఇందులో ప్రధానంగా చర్చించనుంది. ఈ సమావేశం అనంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడనున్నారు.