ర్యాలీకి అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఈ నెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్‌కు పోలీసులు అనుమతినివ్వడం లేదంటూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజాక్) శనివారం హైకోర్టును ఆశ్రయించింది.
శాంతియుతంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేపడతామని హామీ ఇచ్చినా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని టీజాక్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, అధికార ప్రతినిధి జి.వెంకటరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ర్యాలీకి అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, చిక్కడపల్లి ఏసీపీ, చిక్కడపల్లి పీఎస్ ఎస్‌హెచ్‌ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు విచారణ జరపనున్నారు.