►ఈ రూట్లలో కాస్త చూసి వెళ్లండి
హైదరాబాద్: నగరంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి రహదారులన్ని చెరువులను తలపిస్తున్నాయి. కుండపోతగా కురిసిన వర్షం ఇప్పుడిప్పుడే తెరిపినిస్తుండటంతో.. కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు రోడ్డెక్కుతున్నారు. వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోవడంతో.. ఎక్కడ మ్యాన్‌హోల్ ఉంది, ఎక్కడ గుంటలు ఉన్నాయో కనపడక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా 18 ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి.
ఛే నంబర్ చౌరస్తా నుంచి అంబర్‌పేట వరకు, నాంపల్లి ఎగ్జిబీషన్ గ్రౌండ్ ముందు, మొజంజహి మార్కెట్ నుంచి అఫ్జల్‌గంజ్ వరకు, బల్కంపేట పెట్రోల్ బంక్, చాదర్‌ఘాట్ నుంచి పుత్లిబౌలీ చౌరస్తా వరకు, అమీర్‌పేట ఇమేజ్ ఆస్పత్రి ఎదుట, కేసీపీ జంక్షన్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మార్గాల్లో వెళ్లాల్సిన వారు ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
ఉదయం నుంచే జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నప్పటికి మరో రెండు గంటలపాటు ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశం ఉండటంతో.. వాహనదారులు రద్దీ లేని ప్రాంతాలను ఎంచుకోవాల్సిందిగా అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా అత్యవసరం అయితేనే తప్ప, మిగతావారు ఉదయం 11 గంటల వరకూ రోడ్లపైకి రావద్దని సలహా ఇస్తున్నారు.
అమీర్‌పేట, ఎర్రగడ్డ ప్రాంతాల్లో నగరానికి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వందలాదిగా నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బేగంపేట, నిమ్స్, తార్నాక, గోల్నాక, పాత గాంధీ ఆస్పత్రి, మలక్‌పేట్ రైల్వే అండర్ బ్రిడ్జి, షేక్‌పేట నాలా, టోలిచౌకీ, నింబోలి అడ్డ, తిలక్‌నగర్, హిమాయత్‌నగర్, నల్లగొండ క్రాస్ రోడ్డు, చంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. నగర శివారులోని పలు లోతట్టు ప్రాంతాలు జటమయమవడంతో పాటు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)