ఆగస్టులో తెలంగాణ సచివాలయం కూల్చివేత | telangana secretariat demolished in this august | Sakshi
Sakshi News home page

ఆగస్టులో తెలంగాణ సచివాలయం కూల్చివేత

Published Fri, May 27 2016 1:16 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

తాత్కాలిక సచివాలయానికి సరిపడే భవనాల వేట మొదలైంది. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సచివాలయ నిర్మాణానికి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.

మంచి రోజులు రాగానే కొత్త సచివాలయ భవనానికి ముహూర్తం
ఏడాదిలో పనుల పూర్తి లక్ష్యం.. అప్పటిదాకా తాత్కాలిక విడిది
ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన విభాగానికి అద్దె భవనం
పరిశీలనలో ఎంసీహెచ్‌ఆర్‌డీ, బూర్గుల భవన్, ఎక్స్‌పోటెల్ హోటల్
హెచ్‌వోడీ కార్యాలయాల్లో మంత్రులు, అధికారులకు సర్దుబాటు



హైదరాబాద్: తాత్కాలిక సచివాలయానికి సరిపడే భవనాల వేట మొదలైంది. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సచివాలయ నిర్మాణానికి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మంచి రోజులు రాగానే.. ఆగస్టులో ఈ పనులకు ముహూర్తంగా ఎంచుకున్నట్లు అధికార వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఏడాది వ్యవధిలో కొత్త భవన సముదాయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లక్ష్యంగా నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించే వరకు పరిపాలనా వ్యవహారాలకు విఘాతం తలెత్తకుండా చేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.

రెండ్రోజుల కిందట సీఎస్ రాజీవ్‌శర్మ సారధ్యంలోని ఉన్నతాధికారుల కమిటీ వీటిపై ప్రత్యేక సమాలోచనలు జరిపింది. ముఖ్య కార్యదర్శులు అధర్‌సిన్హా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిర్మాణ వ్యవధిలో ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, సచివాలయ కేంద్రంగా ఉండే మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు తమ కార్యకలాపాలు ఎక్కణ్నుంచి నిర్వహించాలనే అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

తాత్కాలిక విడిదిని ఎక్కడ ఏర్పాటు చేయాలి..? ఎక్కడెక్కడ అందుకు అనువైన భవనాలున్నాయని ఆరా తీశారు. హైదరాబాద్‌లో ఉన్న హెచ్‌వోడీ కార్యాలయాలు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఎక్కడెక్కడ ఎంత ఖాళీ స్థలముంది..? ఎక్కడైనా సచివాలయంలోని కార్యాలయాలను సర్దుబాటు చేసే అవకాశముందా.. అనే సమాచారంపై ఆరా తీశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన చర్చల్లోనూ ఇదే విషయంపై ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు తెలిసింది.

మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు, సిబ్బందిని సంబంధిత హెచ్‌వోడీ కార్యాలయాల్లో వీలైనంత మేరకు సర్దుబాటు చేయాలని, అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సీఎస్‌కు సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వ సలహాదారులు ఏడాది పాటు తమ నివాసాల నుంచే విధులు నిర్వహించే అవకాశమిద్దామని ముఖ్యమంత్రి వారితోనే అభిప్రాయపడ్డట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి, సీఎంవో, సాధారణ పరిపాలన విభాగం అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేయటమొకటే మిగులుతుందని, అంతమేరకు సరిపడే భవనమేదైనా ఉందా.. పరిశీలించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.

దీంతో సచివాలయం సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్, లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్‌లోని ఎక్స్‌పోటెల్, జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగం(ఎంసీహెచ్‌ఆర్‌డీ) భవనాల పేర్లు ఉన్నతాధికారుల కమిటీ పరిశీలనకు స్వీకరించింది. వీటిని స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ ఉన్నతాధికారులతో పేర్కొన్నట్లు తెలిసింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న హెచ్‌వోడీ భవనాలు, కార్యాలయాల్లో అంతకు మించి సదుపాయాలున్నవి ఏమైనా ఉన్నాయా..? అని ఆరా తీస్తున్నారు. దీంతో తాత్కాలిక సచివాలయం ఎక్కడ ఏర్పాటవుతుంది.. సచివాలయ కేంద్రంగా పని చేస్తున్న శాఖల అధికారులు, సిబ్బందిని ఎక్కడెక్కడికి తరలిస్తారనేది ఆసక్తి రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement