Telangana: రాష్ట్ర పునర్నిర్మాణ ప్రతీక | CM KCR Comments at inauguration of the new secretariat | Sakshi
Sakshi News home page

Telangana: రాష్ట్ర పునర్నిర్మాణ ప్రతీక

Published Mon, May 1 2023 3:43 AM | Last Updated on Mon, May 1 2023 10:01 AM

CM KCR Comments at inauguration of the new secretariat - Sakshi

ఆదివారం రాత్రి బాణాసంచా వెలుగుల్లో నూతన సచివాలయం, సచివాలయంలో ఫైల్‌పై తొలి సంతకం చేస్తున్న కేసీఆర్‌

చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం, పాలమూరు, ఇతర ప్రాజెక్టులన్నీ తెలంగాణ పునర్నిర్మాణ ప్రతీకలే.. వేసవిలోనూ మత్తడి దూకే చెరువులే సాక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని నగరం నడిబొడ్డున తలెత్తుకుని నిలిచిన కొత్త సచివాలయం తెలంగాణ పునర్మిర్మాణానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, అతి తక్కువ కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలవడమే.. తెలంగాణ సాధించిన ప్రగతి అన్నారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌ సాగర్‌ తీరాన నూతనంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. తర్వాత ఆయనతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై.. కొత్త సచివాలయం నుంచి తొలి సంతకాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ప్రసంగం సారాంశం ఆయన మాటల్లోనే.. 

‘‘తెలంగాణ అవతరణకు ముందు అనేక వాదోపవాదాలు, అనేక చర్చలు చూశాం. తెలంగాణ అవతరించిన తర్వాత కూడా పునర్నిర్మాణం కోసం అంకితభావంతో అడుగులు వేస్తున్న సందర్భంలో.. తెలంగాణ భావాన్ని, అర్థాన్ని, పునర్నిర్మాణ కాంక్షను జీర్ణించుకోలేని కొందరు పిచ్చివాళ్లు కారుకూతలు కూశారు. ఉన్నయన్ని కూలగొట్టి కడతారా? మొత్తం తెలంగాణనే కూలగొట్టి మళ్లా కడతారా? అని కొందరు మరుగుజ్జులు చిల్లర వ్యాఖ్యలు చేశారు. అవేవీ పట్టించుకోకుండా ఈ రోజు ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది తెలంగాణ రాష్ట్రం. 

వేసవిలోనూ మత్తడి దూకే చెరువులతో.. 
పునర్నిర్మాణం అంటే ఏమిటో తెలియని మరుగుజ్జులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సమైక్య పాలనలో చిక్కిశల్యమై శిథిలమై రంధ్రాలు పడి వచ్చిన కాస్త నీటిని కూడా కోల్పోయిన పరిస్థితుల్లో.. కాకతీయ రాజుల స్ఫూర్తితో మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులన్నింటినీ పునరుద్ధరించుకోవడమే పునర్నిర్మాణం. నాడు సమైక్య రాష్ట్రంలో గోదావరిలో నీళ్లు ఎక్కడున్నాయో వెతుక్కునే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లే.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కట్టుకున్నాం. ఇదీ పునర్నిర్మాణం. ఉప నదుల మీద, వాగుల మీద నిర్మించిన చెక్‌డ్యామ్‌లతో ఎక్కడ చూసినా నీళ్లే. ఏప్రిల్, మేలో కూడా చెరువులు మత్తడి దూకడమే పునర్నిర్మాణం. నాడు నెర్రెలుబారి బీళ్లుగా మారిన లక్షల ఎకరాల తెలంగాణ భూములు.. నేడు నిండుగా వెదజల్లుతున్న హరితకాంతులే తెలంగాణ పునర్నిర్మాణం. ఈ యాసంగిలో దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి వేస్తే.. అందులో 56లక్షల ఎకరాలు తెలంగాణలోనివే. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఒక కాళేశ్వరం, ఒక పాలమూరు, ఒక సీతారామ ప్రాజెక్టు. 

దేశానికే ఆదర్శంగా వెలుగుతూ.. 
పరిపాలనా సంస్కరణలతో, ఆచరణాత్మకంగా 33 జిల్లాలతో అలరారుతూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ వెలుగుతోంది. సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమంతోపాటు పారిశ్రామిక విధానంతో లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇండస్ట్రియల్, ఐటీ విధానంలో బెంగళూరును కూడా దాటేసి తారాజువ్వలా దూసుకుపోతోంది.  

మత కల్లోలాల ఊసే లేకుండా.. 
అరాచక శక్తులను అణచివేస్తూ.. శాంతి భద్రతలను కాపాడుతూ తెలంగాణ పోలీసులు దేశానికి మార్గదర్శకులుగా మారారు. గత పదేళ్లుగా తెలంగాణలో ఒక చిన్న మత కల్లోలం కూడా లేకుండా చేశాం. మహిళలకు భరోసానిస్తూ షీ టీమ్‌లు పనిచేస్తున్నాయి. 

అంతర్జాతీయ స్థాయికి హైదరాబాద్‌
అంతర్జాతీయ నగరాలకు దీటుగా హైదరాబాద్‌.. ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌లు, ఎన్నోరకాల సౌకర్యాలతో ముందుకుపోతోంది. నలువైపులా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్లు, అద్భుతమైన వరంగల్‌ హెల్త్‌ సిటీ.. ఇవన్నీ తెలంగాణ పునర్మిర్మాణానికి ప్రతీకలు. భూలోక వైకుంఠంగా యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం జరిగింది. 

మహనీయుడి స్ఫూర్తితో.. 
అంబేడ్కర్, గాంధీజీ చూపిన బాటలో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. ఆకాశమంత ఎత్తున అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. సెక్ర టేరియట్‌కు వచ్చే సీఎం, మంత్రులు, అధికారులందరికీ నిత్యం బాబాసాహెబ్‌ ఆదర్శాలు స్ఫురణకు రావాలని, అంకితభావంతో పనిచేయాలనే ఉద్ధేశంతో సచివాలయానికి ఆయన పేరు పెట్టుకున్నాం. ఇదే కోవలో భవిష్యత్తుకు బాటలు వేసుకుంటామని అందరికీ హామీనిస్తున్నాం. తెలంగాణ సాధన పోరాటంలో అసువులు బాసిన వారికి అంజలి ఘటిస్తున్నాం’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

అభివృద్ధి కొలమానాల్లో మనమే టాప్‌
ప్రపంచంలో అభివృద్ధిని, పునర్నిర్మాణాన్ని కొలమానంగా తీసుకునే సూచికలు రెండే రెండు. ఒకటి తలసరి ఆదాయం (పర్‌క్యాపిటా ఇన్‌కమ్‌), రెండోది తలసరి విద్యుత్‌ వినియోగం (పర్‌ క్యాపిటా పవర్‌ యుటిలైజేషన్‌). ఇప్పుడు తెలంగాణ రూ.3,00,017 తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉంది.

ఒకనాడు సగటు తలసరి విద్యుత్‌ వినియోగం 1,100 యూనిట్లుగా ఉంటే.. నేడు 2,140 యూనిట్లతో దేశంలోనే అగ్రభాగానికి చేరింది. ఇదే తెలంగాణ పునర్మిర్మాణం. నిరాదరణకు గురైన వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎందరో బాధితులు రూ.2,016 ఆసరా పింఛన్లు అందుకుంటూ చిరునవ్వుతో బతుకుతున్నారు. తెలంగాణ పునర్మిర్మాణంలో భాగంగా చేపట్టిన సచివాలయం అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఈ నిర్మాణంలో పాలుపంచుకున్న వివిధ రాష్ట్రాల కూలీలు, కార్మికులకు తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు.

అడవులను తిరిగి తెచ్చుకున్నాం 
నాడు క్షీణించిపోయి ఆగమైన అడవులు ఇప్పుడు అటవీశాఖ పీసీసీఎఫ్‌లు, ఇతర అధికారుల పట్టుదల, కృషితో దేశంలోనే రికార్డు స్థాయిలో పునరుద్ధరణ అయ్యాయి. కోల్పోయిన అడవులను తిరిగి తెచ్చుకోడమే పునర్నిర్మాణం. వలసపోయిన పాలమూరు కూలీలంతా తిరిగొచ్చి సొంత పొలాల గట్ల మీద కూర్చుంటే.. ఇతర రాష్ట్రాల కూలీలు తెలంగాణ పొలాల్లో పనిచేస్తున్న దృశ్యాలే తెలంగాణ పునర్నిర్మాణం.

ఒకనాడు దాహంతో అల్లాడి ఫ్లోరైడ్‌తో నడుం వంగి లక్షలాది మంది జీవితాలు కోల్పోయిన తెలంగాణలో మిషన్‌ భగరీథ ద్వారా ఇంటింటికీ నీరందిస్తున్నాం. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఏ నీళ్లు ఉంటాయో.. ఆదిలాబాద్‌ గోండు గూడెంలో అదే నీరందిస్తున్న మిషన్‌ భగరీథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక. 

కరెంటు వెలుగులతో.. 
కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియక.. పారిశ్రామికవేత్తల ధర్నాలు, ప్రజల గగ్గోలు, జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లతో ఉన్న రాష్ట్రంలో.. ఇప్పుడు అవన్నీ మాయమయ్యాయి. తెలంగాణ కరెంటు వెలుగుజిలుగులతో విరాజిల్లుతోంది.

నాడు పొలాల బోర్లు ఆన్‌ చేసుకునేందుకు అర్ధరాత్రి పొలాలకు వెళ్లి కరెంటు షాకులు, పాము, తేలు కాట్లతో చనిపోయిన రైతులు.. నేడు పొద్దున్నుంచి సాయంత్రం 6 గంటల దాకా పొలాలకు నీరు పారించుకొని.. దర్జాగా ఇంటికి వచ్చి కంటినిండా కునుకుతీస్తున్నారు. ఇదీ తెలంగాణ పునర్నిర్మాణం. గ్రామాలు, పట్టణాలు ఎంత అద్భుతంగా అలరారుతున్నాయో, ఎన్ని అవార్డులు సొంతం చేసుకుంటున్నాయో అందరికీ తెలుసు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement