గురువారం నూతన సచివాలయ భవన సముదాయానికి శంకుస్థాపన సందర్భంగా భూమి పూజ చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ కొత్త భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. సచివాలయం డీ–బ్లాక్ వెనుక భాగం లోని పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్‌లో కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భూమి పూజ నిర్వహించారు. శృంగేరీ పీఠం వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు శుభసూచకంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సీఎం కేసీఆర్ కుడి చేతికి ఇమామ్ జామిన్ కట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కొప ల ఈశ్వర్, జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు. మాజీ మంత్రి హరీశ్‌రావు, సీఎస్ ఎస్.కె. జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.పద్మాచారి, సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులు పాల్గొన్నారు.
పనులు ఇప్పుడే ప్రారంభం కావు..
కొత్త సచివాలయ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ గురువారం శంకుస్థాపన నిర్వహించినా పనులు ప్రారంభం కావడానికి కనీసం 3–4 నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. జూన్ ముగిసిన తర్వాత మరో నెలన్నరపాటు మంచి ముహూర్తాలు లేకపోవడంతో సీఎం కేసీఆర్ గురువారం శంకుస్థాపన నిర్వహించారు. ప్రస్తుత సచివాలయ భవనాల్లో వాస్తుదోషాలున్నాయని, సరైన సదుపాయాలు లేవన్న కారణంతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయంలోని ప్రస్తుత భవనాలన్నింటినీ కూల్చేసి ఒకే బ్లాక్‌గా కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయిం చింది.
కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపై అధ్యయనం కోసం రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం త్వరలో సమావేశమై సచివాలయం, ఎర్రమంజిల్‌లో ఏయే భవనాలను కూల్చాలి? ఏయే భవనాలను మనుగడలోకి ఉంచాలన్న అంశాన్ని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ నివేదిక అందిన తర్వాత భవనాల కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత సచివాలయం 10 బ్లాకులుగా 25.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. సచివాలయం చుట్టూ ఉన్న విద్యుత్‌శాఖ కార్యాలయాల భవనాలు, ఉద్యోగ సంఘాల భవనాలను స్వాధీనం చేసుకొని అందులో కలిపేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత భవనాలన్నీ కూల్చేసి నేలను సమాంతరంగా చదును చేయాలని ప్రభుత్వం భావి స్తోంది.
4 లక్షల నుంచి 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. సచివాలయానికి నలువైపులా రోడ్లు, సచివాలయం సముదాయం ఎదురుగా గార్డె న్లు, ఫౌంటెయిన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆర్కిటెక్ట్‌ల నుంచి ప్రభుత్వం డిజైన్లను సేకరిస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో రూ. 400 కోట్ల వ్యయంతో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మిస్తా మని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చేయనున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న అన్ని శాఖల కార్యాలయాలను ఆయా శాఖల పరిధిలోని హెచ్‌ఓడీ కార్యాలయాలకు తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
బావా.. మన చాంబర్లను చూసుకొద్దామా?
కొత్త సచివాలయ భవన శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన కేటీఆర్, హరీశ్‌రావు సరదాగా ఒకరినొకరు ముచ్చటించుకున్నారు. ‘‘బావా.. ఒక సారి మన చాంబర్లకు పోయి చూసుకొద్దామా?’’అని హరీశ్‌రావుతో కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కేటీఆర్, హరీశ్‌రావులకు అప్పట్లో సచివాలయంలో ప్రత్యేక చాంబర్లు ఉండేవి. ప్రస్తుతం వాటిని ఖాళీగా ఉంచారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన కేటీఆర్‌తో సచివాలయ ఉద్యోగులు అరగంటపాటు సెల్ఫీలు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment