
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, సీఎం కేసీఆర్ కదలికలను లోతుగా పరిశీలిస్తే సచివాలయం కూల్చివేత వెనుక ‘ఆపరేషన్ ఖజానా’బయట పడిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం తన పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణలో అనుమానాస్పదంగా అనేక పనులు జరుగుతున్నాయి. దాదాపు రెండు వారాలపాటు సీఎం ఎవరికీ కనిపించలేదు. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న కొంతమంది మిత్రులు నాకు కొంత సమాచారం ఇచ్చారు. అదే సమాచారం మీడియాకు చెప్తున్నా’అని ఆయన అన్నారు.
వేల మంది పోలీసుల పహారాలో సెక్రటేరియట్‌ను కూల్చివేశారని, కూల్చివేత పనులు వీడియో తీశారని ఇద్దరు కానిస్టేబుళ్లను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారని చెప్పారు. అణుబాంబు ప్రయోగం చేసేటప్పుడు కూడా ఇంత రహస్యం పాటించలేదని, గుప్త నిధుల కోసం తవ్వేవారు మాత్రమే అర్ధరాత్రి ఇలాంటి పనులు చేస్తారని వ్యాఖ్యానించారు. హోంసైన్స్ కాలేజీ కింద వనపర్తి మహారాజ సంస్థానం సంపద దాచిపెట్టిందని ఆర్కియాలజీ విభాగం గతంలోనే చెప్పిందన్న విషయాన్ని గుర్తు చేశారు. నిజాం కాలంలో జీ బ్లాక్ కింద బంకర్లలో నిధులు దాచిపెట్టారని చరిత్ర చెబుతోందని అన్నారు.
హెచ్‌ఎండీఏ నోటిఫై చేసిన హెరిటేజ్ బిల్డింగ్‌లలో సైఫాబాద్ ప్యాలెస్ (జీ బ్లాక్ ) కూడా ఉందని, దాన్ని 183 జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. సీఎంకు అత్యంత నమ్మకస్తులు సీఎస్, డీజీపీతో మాత్రమే రహస్యంగా సమీక్షించాల్సిన అవసరం ఏముందని, ఆర్కియాలజీ విభాగం, ఎన్‌ఎండీసీని కూల్చివేత పనుల్లో ఎందుకు భాగస్వామ్యం చేయడం లేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment