టెలికాలర్‌ దారుణ హత్య | telecaller brutally murdered in hyderabad madhapur | Sakshi
Sakshi News home page

టెలికాలర్‌ దారుణ హత్య

Published Fri, Feb 17 2017 2:06 AM | Last Updated on Fri, Sep 7 2018 4:33 PM

టెలికాలర్‌ దారుణ హత్య - Sakshi

టెలికాలర్‌ దారుణ హత్య

రాజధానిలో మరో ఘోరం
పట్టపగలే యువతిని చంపి, తగలబెట్టిన వైనం
మాదాపూర్‌ భాగ్యనగర్‌ సొసైటీలో ఘటన
పరిచయస్తుడే హంతకుడనే దిశగా పోలీసుల దర్యాప్తు
యువతి ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా పరిశీలన
 

హైదరాబాద్‌: రాజధానిలో మరో ఘోరం జరిగింది. టెలికాలర్‌గా పనిచేస్తున్న సునీత (32) అనే యువతి దారుణ హత్యకు గురైంది. పట్టపగలే ఆమెను హత్య చేసి, పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ భాగ్యనగర్‌ సొసైటీలో బుధవారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

ఆఫీసుకు వెళుతున్నానని చెప్పి..
సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట్‌ సీ క్లాస్‌ ప్రాంతానికి చెందిన కొరపు మాణిక్‌రావు, జానకమ్మ దంపతుల కుమార్తె సునీత. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. గతంలో సులేఖ.కామ్‌లో పనిచేసిన ఆమె.. కొద్దిరోజుల కిందట మాన్‌స్టర్‌.కామ్‌లో టెలికాలర్‌ (సేల్స్‌ రిప్రజెంటేటివ్‌)గా చేరింది. మంగళవారం ఆఫీసుకు వెళుతున్నానంటూ ఇంటి నుంచి వెళ్లింది. కానీ ఆఫీసుకు వెళ్లలేదు. ఆఫీసుకు ఫోన్‌ చేసి.. దగ్గరి బంధువు ఒకరు చనిపోయారని, రెండు రోజులు రాలేనని సమాచారం ఇచ్చింది. మంగళవారం రాత్రి పదింటికి తిరిగి ఇంటికి చేరుకుంది. బుధవారం ఉదయం 9.30కు ఆఫీసుకు బయలుదేరిన ఆమెను అన్న నర్సింగ్‌రావు సికింద్రాబాద్‌ స్టేషన్‌ బస్టాప్‌లో దింపి వెళ్లిపోయాడు. కానీ ఆమె ఆఫీసుకు వెళ్లలేదు. సునీత హత్యకు గురైనట్లు బుధవారం రాత్రి కుటుంబ సభ్యులకుపోలీసుల నుంచి సమాచారం అందింది.

పట్టపగలే హత్య!
భాగ్యనగర్‌ సొసైటీ 1007 ఎన్‌ఐఏ బిల్డింగ్‌ పక్కన ఖాళీ స్థలం నుంచి పొగలు వస్తున్నాయంటూ అక్కడి ఓ సెక్యూరిటీ గార్డు బుధవారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు వచ్చి చూడగా కాలిపోయిన మృతదేహం కనిపించింది. అక్కడే పాక్షికంగా కాలిపోయిన పర్సు, ఐడీ కార్డు లభించాయి. ఆ పర్సులో దొరికిన సిమ్‌ కార్డు ఆధారంగా హతురాలిని సునీతగా గుర్తించారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబీకులకు అప్పగించారు. బుధవారం మధ్యాహ్నమే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక ఆధారాలను బట్టి పోలీసులు అంచనాకు వచ్చారు. ఇది ఎవరో పరిచయస్తుల పనేనని, మరొకరు కూడా సహకరించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

సునీతను పథకం ప్రకారం ఖాళీ స్థలానికి తీసుకొచ్చి హత్య చేసి, పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఉంటారని భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు జరుపుతున్నారు. సునీత సెల్‌ఫోన్‌ కాల్‌ డిటైల్స్, భాగ్యనగర్‌ సొసైటీ, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. హత్యకు ముందు రోజు వాలెంటైన్స్‌ డే కావడంతో ప్రేమ వ్యవహారం, పెళ్లి ప్రస్తావన ఈ హత్యకు కారణాలై ఉంటాయా అన్న కోణాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఓ అనుమానిత యువకుడి ఫొటోలను సునీత మెయిల్‌ నుంచి పోలీసులు తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ముందు రోజు నుంచి ముభావంగా..
మంగళవారం రాత్రి సునీత ముభావంగా కనిపించిందని, అన్నం కూడా సరిగా తినలేదని ఆమె అక్క శ్రీదేవి చెప్పారు. బుధవారం ఉదయం సునీత ఆఫీసుకు వెళుతుండగా.. లంచ్‌ బాక్స్‌ సిద్ధం చేయబోతే ఆఫీసులో పార్టీ ఉందంటూ వారించిందని తెలిపారు. ఇక ఓ ఫోన్‌ కాల్‌ వస్తే సునీత విపరీతంగా ఏడ్చేదని, అది ఎవరనేది తమకు చెప్పేది కాదని ఆమె అన్న నర్సింగరావు చెప్పారు. 2001లో ఓ యువకుడు తనను ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని, తాము కేసు పెట్టడంతో జైలు పాలయ్యాడని వెల్లడించారు.

ఆ కుటుంబంలో ఎప్పుడూ విషాదమే!
సునీత తల్లిదండ్రులు మాణిక్‌రావు, జానకమ్మలకు 11 మంది సంతానం. అందులో సువర్ణ, హేమలత, పుష్పలత, శ్రీదేవి, సునీత కుమార్తెలు, శోభన్‌బాబు, సతీశ్, తిరుమల్, శ్రీను, నర్సింగ్‌రావు, హన్మంతు అనే కుమారులున్నారు. కానీ ఈ పెద్ద కుటుంబంలో ఎప్పుడూ ఓ విషాదమే. కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకోగా.. ఒకరు ఆచూకీ లేకుండా పోయారు. మిగతా ఐదుగురిలో ఇద్దరికి వివాహాలు కాగా.. ముగ్గురు కుటుంబ భారాన్ని మోస్తున్నారు. ఈ ముగ్గురిలో ఇప్పుడు సునీత హత్యకు గురైంది.

మాణిక్‌రావు 11 మంది సంతానంలో సువర్ణ బావిలో దూకి తనువు చాలించగా.. శోభన్‌ బాబు, సతీశ్, శ్రీను ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తిరుమల్‌ కొన్నేళ్ల కింద ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన భార్య కూడా మరణించింది. హన్మంతు కొన్నేళ్ల కింద ఇల్లు వదిలి వెళ్లిపోయారు. సునీత తన సోదరి శ్రీదేవి, సోదరుడు నర్సింగ్‌రావుతో కలసి బన్సీలాల్‌పేటలో ఉంటున్నారు. నర్సింగ్‌రావు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఇక ఆత్మహత్యకు పాల్పడ్డ తిరుమల్‌కు ఆకర్షిక (13), రిషిక (12) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఇద్దరినీ సునీత తన సొంత పిల్లల్లా చూసుకుంటోంది. వారి కోసం తను వివాహం కూడా చేసుకోలేదని చెబుతున్నారు. ఇప్పుడు సునీత దారుణ హత్యకు గురికావడంతో ఆ చిన్నారులు విలపించిన తీరు అందరినీ కలచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement