♦ ఆందోళనలు, అరెస్టుల మధ్య
♦ ఆర్ట్స్ కాలేజీ వార్షికోత్సవం
♦ బలవంతంగా విద్యార్థుల అరెస్ట్
♦ పోలీసుల తీరుకు నిరసనగా ర్యాలీ
ఉస్మానియా యూనివర్సిటీ : ఆనందంతో జరగాల్సిన కళాశాల వార్షికోత్సవం విద్యార్థుల ఆందోళనలు, అరెస్టుల మధ్య జరిగింది. గురువారం ఓయూ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవానికి ఏర్పాట్లు చేసి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర సాంస్కృతిక విభాగం చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌లను ఆహ్వానించారు. అయితే కొంత కాలంగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని ఆందోళన చేస్తున్న తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు కోటూరి మానవతరాయ్, చైర్మన్ కళ్యాణ్‌లు కళాశాల వార్షికోత్సవానికి టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు హాజరైతే శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు.
యూనివర్సిటీ లైబ్రరీలో పీజీ విద్యార్థి సంఘం అధ్యక్షులు ప్రవీణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈలోగా పోలీసులు లోనికి వెళ్లి ఏడుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. విద్యార్థులు లైబ్రరీ నుంచి బయటకు వస్తే అరెస్టు చేస్తామని మైకులతో హెచ్చరించారు. వార్షికోత్సవం జరిగే ఠాగూర్ ఆడిటోరియం వద్ద మూడంచెల పోలీసుల భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు. లైబ్రరీ, ల్యాండ్‌స్కేప్ గార్డెన్, ఆర్ట్స్ కళాశాల, లా కాలేజ్ తదితర ప్రాంతాలలో పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు.
కాగా విద్యార్థుల అరెస్టుకు నిరసనగా నిరుద్యోగులు, విద్యార్థులు పలువురు లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు మూతులకు గుడ్డకట్టుకొని నిరసన ప్రదర్శన చేపట్టారు. పోలీసుల తీరుకు నిరసనగా శుక్రవారం పాలన భవనాన్ని ముట్టడించనునట్లు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడే వరకు టీఆర్‌ఎస్ మంత్రులను, పార్టీ శ్రేణులను ఓయూ క్యాంపస్‌లో అడుగుపెట్టనివ్వబోమని కళ్యాణ్ హెచ్చరించారు.
ఓయూలో ఉద్రిక్తత
Published Fri, Apr 10 2015 12:27 AM | Last Updated on Fri, Nov 9 2018 4:19 PM
Advertisement