
హెల్మెట్ లేకుంటే పోలీసులపైనా చర్యలు
ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలంటూ అల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫీక్...
అల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫీక్
కుషాయిగూడ: ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలంటూ అల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫీక్, ఎల్‌బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎన్.వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రజలను జాగృతం చేసేందుకు చేపట్టిన హెల్మెట్ అవగాహన ర్యాలీని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా 110 మంది సిబ్బందికి హెల్మెట్‌లను అందజేసిన అనంతరం మాట్లాడారు. విధి నిర్వహణలో భాగంగా హెల్మెట్ ధరించిన వారికి జరిమానాలు విధించే పోలీసులు ముందుగా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి విధులు నిర్వహించాలనే ఉద్దేశంతోనే అందరికీ హెల్మెట్‌లను అందజేసినట్లు తెలిపారు. హెల్మెట్ ధరించకుండా విధులకు హాజరయ్యే పోలీసులపై చర్యలు తప్పవన్నారు.
ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం పైగా హెల్మెట్ ధరించక పోవడం వల్లే మరణిస్తున్నట్లు జాతీయ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో హెల్మెట్ తప్పనిసరిగా వాడాలన్న నిబంధనలను ఇక కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే పోలీసులతో అవగాహన ర్యాలీని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలలో మరణించిన, వికలాంగులుగా మారిన వందల కుటుంబాలు పెద్దదిక్కు కోల్పోయి వీధిన పడ్డ సంఘటనలు ఉన్నాయి. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా చూడాలనే చక్కటి ఆశయంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించి హెల్మెట్ ధరించాలని కోరారు. కార్యక్రమంలో డీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్సైలు జగన్‌రెడ్డి, సుధీర్‌కృష్ణ, నర్సింగ్‌రావు, అనిల్, రవితో పాటుగా యువజన విద్యార్థి సంఘాల ప్రతినిధులు సురేష్‌గుప్త, లింగం తదితరులు పాల్గొన్నారు.