తెలుగు వారికి గర్వకారణమైన నటసామ్రాట్ డా.అక్కినేని నాగేశ్వరరావు భారత చలన చిత్ర రంగంలోనే ఓ దిగ్గజమని శాసన మండలి అధ్యక్షులు డా.ఎ.చక్రపాణి కీర్తించారు.
వివేక్‌నగర్, న్యూస్‌లైన్: తెలుగు వారికి గర్వకారణమైన నటసామ్రాట్ డా.అక్కినేని నాగేశ్వరరావు భారత చలన చిత్ర రంగంలోనే ఓ దిగ్గజమని శాసన మండలి అధ్యక్షులు డా.ఎ.చక్రపాణి కీర్తించారు. తెలుగు చలన చిత్ర సీమలో ఒక ధ్రువతార రాలిపోయిందంటూ ఆయన అక్కినేనికి ఘనంగా నివాళులర్పించారు. డా.అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్, శ్రీ త్యాగరాయ గానసభల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన మహానటులు అక్కినేని నాగేశ్వరరావు సంస్మరణ సభలో ఆయన ప్రసంగించారు.
ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఆదర్శజీవితం ఆయన సొంతమని ఆయన మృతికి తొలిసారిగా శాసన మండలిలో నివాళులర్పించి సంతాప తీర్మానం చేశామన్నారు. నటులు చాట్ల శ్రీరాములు మాట్లాడుతూ నాటక రం గాన్ని అమితంగా ప్రేమించే అక్కినేని పేరిట గురుకుల స్థాయిలో నటనాలయం స్థాపించాలనే యోచన ఉందని ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఆ దిశగా అడుగులు వేస్తామని తెలిపారు.
సభలో సారిపల్లి కొండలరావు, ఎంఎల్‌సి రుద్రరాజు పద్మరాజు, నటులు కైకాల సత్యనారాయణ, పి.వి.రాజేశ్వరరావు, డా.కె.వి.కష్ణకుమారి, పరుచూరి హనుమంతరావు, వై.కె.నాగేశ్వరరావు, లంక లక్ష్మీనారాయణ, వంశీరామరాజు, డా. యం.కె.రాము, మద్దాళి రఘురామ్, ప్రవాస భారతీయురాలు, యుఎస్‌ఏ తెలుగు కళాసమితి రేవతి, ఎస్వీ.రామారావు, కళాదీక్షితులు, డా.పోతుకూచి సాం బశివరావు, పలువురు సాహితీవేత్తలు, నాటక రంగ, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఒక నిముషం మౌనం పాటించి దివంగత అక్కినేనికి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.