మెట్రో అలైన్‌మెంట్ మార్పులపై హర్షం
చారిత్రక, వారసత్వ కట్టడాలకు భంగం వాటిల్లకుండా సుల్తాన్‌బజార్, అసెంబ్లీ, పాతనగరంలో మెట్రో అలైన్‌మెంట్ మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శ్రీకారం చుట్టడం పట్ల పాతనగర వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాతనగరంలో వారసత్వ కట్టడాలు, ప్రార్థనాస్థలాల మనుగడకు ఎలాంటి నష్టం వాటిల్లదని, పర్యాటక రంగానికి ఢోకా ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా తాజా మార్పులతో పాతనగరంలోని ఏడు చారిత్రక దేవాలయాలు, 28 ప్రార్థనాస్థలాలు, వందలాది నివాసాలకు నష్టం వాటిల్లకుండా జేబీఎస్-ఫలక్‌నుమా(కారిడార్-2)రూట్లో మార్గం మార్పుపై నిర్మాణసంస్థకు పూర్తివివరాలతో బుధవారం రాష్ట్ర సర్కారు లేఖ అందజేయనున్న విషయం విదితమే.
ఇక అలైన్‌మెంట్ మార్పుపై హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ నిపుణులతోపాటు మెట్రో పనుల నాణ్యత, డిజైనింగ్‌ను పర్యవేక్షిస్తున్న స్వతంత్ర ఇంజినీరింగ్ సంస్థ లూయిస్ బెర్జర్ నిపుణులు సైతం సుల్తాన్‌బజార్, అసెంబ్లీతోపాటు పాతనగరంలో అలైన్‌మెంట్ మారనున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి త్వరలో తాజా అలైన్‌మెంట్ ఖరారు చేయనున్నారు. ఇందుకు అయ్యే అదనపు వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధంగా ఉన్న విషయం విదితమే.
పాతనగరంలో అలైన్‌మెంట్ మార్పులు ఇక్కడే...
కారిడార్-2 పరిధిలోని జేబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో (14.78కి.మీ) మెట్రో రైలుమార్గం పాతబస్తీలోని దారుషిఫా-మీర్‌చౌక్-శాలిబండ మీదుగా వెళితే పలు మసీదులు, అషురుఖానాలు, ఛిల్లాల మనుగడకు నష్టం వాటిల్లుతుందని ఎంఐఎం పార్టీతోపాటు ఇన్‌టాక్ వంటి వారసత్వ కట్టడాల పరిరక్షణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈనేపథ్యంలోనే అలైన్‌మెంట్ మార్పునకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. కాగా తాజాగా మారనున్న మెట్రో మార్గాన్ని బహదూర్‌పూరా- కాలాపత్తర్- ఫలక్‌నుమా మీదుగా మళ్లించాలన్న డిమాండ్‌లు వినిపిస్తున్న నేపథ్యంలో నిపుణుల బృందం ఆయా మార్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నెలరోజుల్లోగా నూతన మెట్రో మార్గాన్ని ఖరారు చేయనుంది. నిపుణుల బృందం పరిశీలన అనంతరం ప్రభుత్వానికి సమర్పించనున్న నివేదికలో అలైన్‌మెంట్ మార్పునకు అయ్యే అదనపు వ్యయం, ఆస్తులు, స్థలాల సేకరణ, బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, మెట్రో మార్గంలో వచ్చే మలుపులు వంటి అంశాలపై స్పష్టతరానుంది.