డిసెంబర్‌లోగా తేల్చండి!
‘మెట్రో’ ఆస్తుల సేకరణపై సర్కారుకు స్పష్టం చేసిన ఎల్‌అండ్‌టీ లేకుంటే పనులు గడువులోగా పూర్తి చేయలేవున్న సంస్థ
3 కారిడార్ల పరిధిలో 1,700 ఆస్తుల సేకరణకు విడుదలే కాని నోటిఫికేషన్
కేంద్రం కనుసన్నల్లో అలైన్‌మెంట్ మార్పులు?
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రాజెక్టు ఆస్తుల సేకరణ ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తిచేయని పక్షంలో ప్రాజెక్టు పనులు ముందుకు సాగవని ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ రాష్ట్ర సర్కారుకు స్పష్టం చేసింది. నాగోల్-శిల్పారామం, ఎల్బీనగర్ -మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా రూట్లలో మొత్తంగా 1,700 ఆస్తుల సేకరణ విషయంలో రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరచూ విధిస్తున్న తుది గడువులు సత్ఫలితాన్నివ్వలేదని పేర్కొన్నట్లు తెలిసింది. ఆస్తుల సేకరణ ప్రక్రియ పూర్తిచేసి ప్రధాన రహదారులపై తమకు పనులు చేపట్టేందుకు వీలుగా రహదారి మధ్యలో 8 మీటర్ల విస్తీర్ణంలో బార్‌కేడింగ్(ఇనుపకంచె)కు అనుమతివ్వడంతోపాటు వాహనాల రాకపోకలకు వీలుగా రైట్‌ఆఫ్‌వే ఏర్పాటు చేయని పక్షంలో మొత్తం 72 కి.మీ ప్రాజెక్టు పనులను 2017 చివరినాటికి పూర్తిచేయడం అసాధ్యమని.. తాము ఇప్పటివరకు చేపట్టిన పనులపై సమీక్ష జరుపుకోక తప్పదని ఎల్‌అండ్‌టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి కరాఖండిగా చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా బేగంపేట్ గ్రీన్‌ల్యాండ్స్, నాంపల్లి, సోమాజిగూడ, అమీర్‌పేట, సికింద్రాబాద్ ఇస్కాన్ దేవాలయం, జేబీఎస్-ఫలక్‌నుమా రూట్లోని ఎంజీబీఎస్, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషేర్‌గంజ్, జంగమ్మెట్, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో ఆస్తుల సేకరణ ప్రక్రియకు జీహెచ్‌ఎంసీ ఇప్పటివరకూ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో ఆయా ప్రాంతాల్లో పనులు మరింత జాప్యం కాక తప్పదని తెలిపినట్లు సవూచారం. భూసేకరణ-పునరావాస చట్టం-2012 ప్రకారం బాధితులకు ఎంత మేర పరిహారం అందజేస్తారన్న విషయంలోనూ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎంఆర్ సంస్థలు స్పష్టత ఇవ్వకపోవడంతో పలు ప్రాంతాల్లో ఇప్పటివరకు పనులే మొదలు పెట్టలేదని తేటతెల్లం చేసింది.
మరోవైపు కారిడార్-2 పరిధిలోని జేబీఎస్-ఫలక్‌నుమా రూట్లో ఎంఐఎం పార్టీ తాజాగా తాము సూచించిన మార్గాల్లోనే మెట్రో మార్గాన్ని మళ్లించాలని పట్టుబడుతుండటంతో ఈ విషయంలో ప్రభుత్వం తక్షణం తమ విధానం స్పష్టం చేయాలని, లేని పక్షంలో ప్రాజెక్టు పనులపై నీలినీడలు కమ్ముకోవడం తథ్యమని నిర్మాణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రాజెక్టు పనుల్లో సిగ్నలింగ్, కవుూ్యనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టం, టికెట్ విక్రయ యంత్రాలు, స్మార్ట్‌కార్డులు, ఆటోమేటిక్ గేట్లు, పట్టాలు పరిచే పనులను పలు విదేశీ సంస్థలకు సబ్‌కాంట్రాక్టులు ఇచ్చామని గడువులోగా పనులు పూర్తిచేయకుంటే సదరు ఏజెన్సీలు వెనుకడుగు వేస్తాయని ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలి సింది. మరోవైపు పలు ప్రభుత్వరంగ బ్యాంకుల రుణాలపై వడ్డీల భారం పెరుగుతుందని, నగరానికి తరలించిన భారీయంత్ర సావుగ్రి, క్రేన్లు, లాంచింగ్ గడ్డర్ల నిర్వహణ ఖర్చులూ తడిసి మోపెడవుతాయని సర్కారు దృష్టికి తీసుకొచ్చింది. మరోవైపు మెట్రో కారిడార్ల పరిధిలో ఎర్రమంజిల్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, అమీర్‌పేట్ ప్రాంతాల్లో తాము నిర్మించాలనుకున్న మాల్స్‌కు జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ నుంచి అందాల్సిన అనుమతులు రెండేళ్లుగా జాప్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
కేంద్రం కోర్టులో అలైన్‌మెంట్ బంతి..?
అసెంబ్లీ, సుల్తాన్ బజార్ ప్రాంతాల్లో మెట్రో అలైన్‌మెంట్ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గక తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటీవలే మెట్రో ప్రాజెక్టును ట్రామ్‌వే యాక్ట్ పరిధి నుంచి మినహాయించి సెంట్రల్ మెట్రో యాక్ట్ పరిధిలోకి తీసుకువచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో అలైన్‌మెంట్ మార్చిన పక్షంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు తాజాగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మారిన అలైన్‌మెంట్‌ను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తిరిగి ప్రకటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ శాఖ నుంచి కొర్రీ ఎదురయితే అలైన్‌మెంట్ మార్పుపై వెనక్కి తగ్గక తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాగా మరో వారం రోజుల్లోగా అలైన్‌మెంట్ మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.