నాగోల్–మెట్టుగూడా రూట్లో మెట్రో ట్రయల్ రన్ (ఫైల్)
సాక్షి,సిటీబ్యూరో: మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ ప్రారంభంపై నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రభుత్వం నుంచి మరిన్ని రాయితీలు,ప్రోత్సాహకాలు ఆశించి ప్రారంభాన్ని మరింత ఆలస్యం చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాగోల్–మెట్టుగూడా(8కి.మీ),మియాపూర్–ఎస్.ఆర్.నగర్(12 కి.మీ)మార్గంలో మెట్రో మార్గం పూర్తయ్యింది. ఈ రెండు రూట్లలో అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వాణిజ్య కార్యకలాపాల ప్రారంభానికి సంస్థ వర్గాలు ముందుకు రాకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
2011లో కుదిరిన నిర్మా ణ ఒప్పందం ప్రకారం ఎల్భీనగర్–మియాపూర్,నాగోల్–రహేజా ఐటీపార్క్,జేబీఎస్–ఫలక్‌నుమా మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మెట్రో మార్గాన్ని 2017 జూన్ లోగా పూర్తిచేయాల్సి ఉంది. అయితే రైట్‌ఆఫ్‌వే అనుకున్న సమయానికి దక్కకపోవడం, ట్రాఫిక్ అనుమతులు, ఆస్తుల సేకరణ ప్రక్రియలో జాప్యం, కోర్టు కేసుల కారణంగా 2018 డిసెంబర్‌కు ప్రాజెక్టు గడువు ను పొడిగించారు. దీంతో యంత్రసామాగ్రి అద్దెలు, పెట్టుబడి, వడ్డీలతో కాంట్రాక్టు సంస్థపై సుమారు రూ.3 వేల కోట్ల అదనపు భారం పడినట్లు సమాచారం.
ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని.. లేని పక్షంలో ఆ మేరకు రాయితీలు కల్పించాలని పట్టుబడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అవసరమైతే ఒప్పందానికి సవరణలు చేయాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. అయితే ఎల్‌అండ్‌టీ కోర్కెలను తీర్చేందుకు సర్కారు పెద్దలు అంగీకరించకపోవడం తో సయోధ్య కుదరక ప్రారంభంలో జాప్యం జరుగుతోంది. జేబీఎస్–ఫలక్‌నుమా(కారిడార్–2) మార్గం లో ఎంజీబీఎస్–ఫలక్‌నుమా(5.3 కి.మీ)మార్గంలో అలైన్‌మెంట్ మార్పుపై సర్కారు ఎటూ తేల్చకపోవడంతో ఈరూట్లో పనులు ప్రారంభం కాలేదు.
ఈ లెక్క న పాతనగరానికి మరో రెండేళ్లు ఆలస్యంగా మెట్రో రైళ్లు వెళ్లడం ఖాయమని సంకేతాలు వెలువడుతున్నా యి. ప్రస్తుతం మూడు కారిడార్లలో 72 కి.మీ మార్గానికి గాను.. 56 కి.మీ మార్గంలో మెట్రో పిల్లర్ల ఏర్పాటు, 47 కి.మీ మార్గంలో పిల్లర్లపై ట్రాక్ ఏర్పాటుకు అవసరమైన వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు పనులు పూర్తయినట్లు హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి.
దసరాకు ప్రారంభంపై వీడని సస్పెన్స్...
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మియాపూర్–ఎస్.ఆర్.నగర్,నాగోల్–మెట్టుగూడా మార్గాల్లో దసరాకు మెట్రో రైళ్ల రాకపోకలు సాగిస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఇటు సర్కారు పెద్దలు అటు హెచ్‌ఎంఆర్,ఎల్‌అండ్‌టీ వర్గాలు మాత్రం తొలిదశ ప్రారంభ తేదీపై పెదవి విప్పకపోవడం గమనార్హం. వారి తీరు ఎవరిదారి వారిదే అన్న చందంగా మారడంతో గ్రేటర్ సిటీజన్లు నిరాశకు లోనవుతున్నారు.
పార్కింగ్..మినీ బస్సుల రాకపోకలపైనా
అదే తీరు..
నాగోల్–మెట్టుగూడా,మియాపూర్–ఎస్.ఆర్.నగర్ రూట్లలో మొత్తం 20 కి.మీ మార్గంలో మెట్రో మార్గం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఈ రూట్లలో ఉన్న 16 మెట్రో స్టేషన్లలో అవసరమైన పార్కింగ్ వసతులు లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. మరోవైపు ప్రయాణీకులకు వీలుగా మినీ బస్సులు అందుబాటు లో లేకపోవడం గమనార్హం. కాగా నిర్మాణ ఒప్పం దంలో మొత్తం మూడు కారిడార్లలో ఏర్పాటు కానున్న 65 స్టేషన్లలో ప్రతి స్టేషన్‌కు విధిగా పార్కింగ్ వసతులు, స్టేషన్లకు సమీపంలో ఉండే కాలనీలకు మినీ బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. కానీ ఈ విషయంలో నేటికీ స్పష్టత కొరవడడం గమనార్హం.