ఎమ్మెల్సీ..పోటాపోటీ
ముగిసిన నామినేషన్ల ఘట్టం
భారీ ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
బరిలో 18 మంది..23న తుది జాబితా
మార్చి 9న పోలింగ్
సిటీబ్యూరో: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలో పోటాపోటీ ఏర్పడింది. మొత్తం 18 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన సోమవారం భారీ ర్యాలీలతో అభ్యర్థులు హోరెత్తించారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి(టీఆర్‌ఎస్), ఏవీఎన్‌రెడ్డి(ఎస్‌టీయూ), మాణిక్‌రెడ్డి(యూటీఎఫ్), నర్రా భూపతిరెడ్డి(టీఆర్‌టీఎస్)లతో పాటు మహ్మద్ మొహినొద్దీన్, ఎస్.విజయ్‌కుమార్, హర్షవర్ధన్‌రెడ్డి, ఎంవీ నర్సింగ్‌రావు, ఎ.లక్ష్మయ్య, మీసాల గోపాల్ సాయిబాబ, ఆరకల కృష్ణగౌడ్, వి.నతానియేల్, జ్ఞానేశ్వరమ్మ, ఎం.మమత, కోయల్‌కార్ బోజరాజు, సంతోష్‌యాదవ్, ఇ.లక్ష్మయ్యలు ఉన్నారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాత 23వ తేదీ సాయంత్రం పోటీలో మిగిలే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే మూడు జిల్లాల పరిధిలో మొత్తం 23,013 మంది ఓటర్లు ఉండగా అందులో హైదరాబాద్ జిల్లాలో 4501, రంగారెడ్డిలో 11837, మహబూబ్‌నగర్‌లో 6675 మంది ఓటర్లున్నారు.
భారీ ర్యాలీలు
చివరి రోజున పది నామినేషన్లు దాఖలయ్యాయి. ఎస్‌టీయూ అభ్యర్థి ఏవీఎన్‌రెడ్డి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన వెంట ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు భుజంగరావుతో పాటు, టీఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కిష్టయ్య, అబ్దుల్లా, తెలంగాణ ఎయిడెడ్ టీచర్స్ అధ్యక్ష, కార్యదర్శులు దేశ్‌పాండే, గీతాంజలితో పాటు వివిధ సంఘాలు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవీఎన్‌రెడ్డి మాట్లాడుతూ నిజాయితీ, నిబద్ధత కలిగిన తనకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.
స్థానిక సంస్థల నియోజకవర్గానికి నేడు నోటిఫికేషన్
సాక్షి, సిటీబ్యూరో: శాసనమండలిలో హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ స్థానానికి జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యంవహిస్తున్న సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ పదవీ కాలం 2017 మే 1వ తేదీన ముగియనుండటంతో, దాన్ని భర్తీ చేసేందుకు ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 28. మార్చి 1వ తేదీన నామినేషన్ల పరిశీలన, మార్చి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు, మార్చి 17వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంట ల వరకు పోలింగ్, మార్చి 20వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ ఎన్నికల నిర్వహణకు జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని ముఖ్యఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది.