చదువు మాన్పిస్తాం.. పెళ్ళి చేస్తామంటూ తల్లిదండ్రులు గట్టిగా చెప్పడంతో ఓ యువతి ఇంట్లో నుంచి అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ రోడ్ నెం. 7 జ్ఞానిజైల్‌సింగ్‌నగర్ బస్తీలో నివసించే పి.సాయిలక్ష్మి(19) ఇటీవలి ఇంటర్ రెండోసంవత్సరం పరీక్షల్లో మొదటి శ్రేణిలోపాస్ అయ్యింది. డిగ్రీ చదవాలని ఎంతో ఆశపడింది.
కొద్ది రోజులైతే డిగ్రీ కళాశాలకు వెళ్తానని స్నేహితులతో ఆనందంగా చెప్పేది. ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో చేరేందుకు దరఖాస్తులు కూడా చేసుకుంది. అయితే తల్లి వనిత, తండ్రి పి.గోపాల్ మాత్రం ఆమె చదువుకు ససేమీరా అన్నారు. చదువు మానెయ్... వచ్చే నెలలో పెళ్ళి చేస్తామంటూ తల్లి గట్టిగా చెప్పింది. ఇలాగే ఉంటే తనకు పెళ్ళి చేయడం ఖాయమని తనకు ఎంతో ఇష్టమైన చదువుకు దూరమవుతానని బాధతో ఈ నెల 5వ తేదీన ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
ప్రభుత్వ హాస్టల్‌లో ఉండి చదువుకుంటాను తప్పితే పెళ్ళి మాత్రం చేసుకోనని చుట్టుపక్కల వారితో అన్నట్లు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదువు మాన్పిస్తారని.. పారిపోయింది..
Published Wed, Jun 15 2016 7:09 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement