వ్యవసాయ శాఖలో విలీనం సరికాదు
రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దుచేసి వ్యవసాయ శాఖలో విలీనం చేయాలన్న ప్రయత్నాలను తక్షణం విరమించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా రెవెన్యూ వ్యవస్థను వేరే శాఖలో విలీనం చేయలేదని, కానీ, తెలంగాణలో ఆ దిశలో ప్రయత్నాలు ప్రారంభించడం ఆందోళన కలిగిస్తోందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రెవెన్యూ వ్యవస్థను బలోపేతంచేసి భూ హక్కుదారులకు మరిన్ని ప్రయోజనాలు కలిగే విధంగా ప్రభుత్వం చూడాలని కోరారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి సమస్యలను పరిష్కరించే బదులు, ఇప్పటికే అసమర్ధంగా పనిచేస్తున్న వ్యవసాయశాఖలో విలీనం చేయడం నష్టదాయకమన్నారు. ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి దీనిపై సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.