రుణమాఫీ అమలులో తాత్సారం వద్దు
పామర్రు :
రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయకుండా యుద్ధప్రాతిపదికన అమలు చేస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు చెప్పా. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సంతకాలు చేయడం, శ్వేతపత్రాలు ఇవ్వడం, చర్చించడం, కమిటీలు వేయడం తదితర దీర్ఘకాలిక ప్రణాళికల వల్ల ఖరీఫ్ ప్రారంభంలో ఉన్న రైతులు రుణాల కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాత రుణాలు రద్దుకాక, కొత్త రుణాలు మంజూరు కాక రైతులు కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించేదని, ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని నగదు బదిలీగా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. గతంలో నగదు బదిలీ ద్వారా గ్యాస్ సరఫరా అని వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టారని, పలు ఇబ్బందులకు గురిచేసి చివరికి నగదు బదిలీని నిలుపుదల చేశారని గుర్తుచేశారు. నగదు బదిలీ వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందే కానీ ప్రయోజనం ఉండదన్నారు.
వ్యవసాయ రుణాలు పెంచాలి...
పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా వ్యవసాయ రుణాలను పెంపుదల చేయాలని ఉమామహేశ్వరరావు కోరారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ప్రజలను నిరాశ నిస్పృహలకు గురిచేసేదిలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవే కాకుండా ఇతర వాగ్దానాలైన పెట్టుబడి ఏర్పాటు తదితర అంశాలపై కూడా ఒక ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఈ నెల 13న విజయవాడలోని స్వర్ణవేదిక వద్ద సదస్సు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సదస్సులో పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మేధావులు, పెద్దలు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి చేబ్రోలు భాస్కరరావు, డివిజన్ కమిటీ సభ్యులు ముళ్లపూడి విల్సన్ , సీహెచ్.పోతురాజు పాల్గొన్నారు.