విద్యుత్ బిల్లు చెల్లించేందుకు డబ్బేది?
ముషీరాబాద్ : ఐదు సంవత్సరాల నుంచి జీహెచ్‌ఎంసీ నగర కేంద్ర గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సిన దాదాపు 80 కోట్ల సెస్ చెల్లించడం లేదని, దానికి తోడు మీ సేవ నుంచి రావాల్సిన సెస్ కూడా గత రెండు సంవత్సరాల నుంచి రావడం లేదని నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ సామకృష్ణారెడ్డి సాక్షికి తెలిపారు. సోమవారం సాక్షి దిన పత్రికలో ‘అంధకారంలో నగర కేంద్ర గ్రంథాలయం’ పేరుతో వచ్చిన కథనానికి చైర్మన్ వివరణ ఇచ్చారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలువడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తున్నప్పటికీ స్పందించడం లేదని తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి సంస్థ దగ్గర ఉన్న డబ్బుల నుంచి పేపర్ బిల్లు, విద్యుత్ బిల్లులు, జీతాలు, పింఛన్లు చెల్లిస్తున్నామని తెలిపారు. అయితే సంస్థ దగ్గర నిధులు అయిపోవడంతో ప్రస్తుతం ఉన్న 60 వేల కరెంట్ బిల్లును, ప్రతి నెలా ఇవ్వాల్సిన పింఛన్లను ఇవ్వలేదని తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో కరెంట్ బిల్లుతో పాటు ఉద్యోగుల జీతాలు, పేపర్ బిల్లులు కూడా చెల్లించని పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు.