
పోలీస్ వెబ్‌సైట్.. సర్వీస్ అదుర్స్
► సత్ఫలితాలిస్తున్నసీసీటీఎన్‌ఎస్ గో లైవ్..
►6 నెలల్లో 1.68 లక్షల మందికి ఎఫ్‌ఐఆర్ ఎస్సెమ్మెస్
►7,780 మంది బాధితులకు ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువయ్యేలా.. ఫిర్యాదులు, కేసుల స్థితిని సులభంగా తెలుసుకునేలా అందుబా టులోకి తీసుకొచ్చిన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్‌ఎస్) సత్ఫలితాలనిస్తోంది. ఈ ఏడాది మార్చిలో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీస్ ద్వారా 1.68 లక్షల మంది ఎఫ్‌ఐఆర్ అక్నాల్డెజ్‌మెంట్ సందేశం స్వీకరించారు.
పోలీస్ వెబ్‌సైట్ ద్వారా అదృశ్యమైన వ్యక్తుల వివరాలను 15,288 మంది తెలుసుకోగా, 83 మంది ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు, కేసు నమోదు తర్వాత అరెస్టయిన నిందితుల వివరాలను 10,288 మంది తెలుసుకోగా.. 1,011మంది పిటిషన్ పరిస్థితిని పరిశీలించుకు న్నారు. అలాగే గతేడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు 7,780 మంది ఎఫ్‌ఐఆర్ డౌన్ లోడ్ చేసుకున్నారు. మరోవైపు పోలీస్ వెబ్‌సైట్ ను ఇప్పటివరకు 7.7 లక్షల మంది వీక్షించారు.
నమస్కారం.. మీ ఫిర్యాదు వివరాలు..
‘నమస్కారం.. మీరు దాఖలు చేసిన ఫిర్యాదు స్వీకరించాం. ఫిర్యాదు చేసిన అంశాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. అందుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నంబర్.. ధన్యవాదాలు’ ఇలా 24 గంటల్లోపు పిటిషన్ నంబర్, తదితర వివరాలతో సంక్షిప్త సందేశం ఫిర్యాదుదారులకు అందుతోంది. అలాగే ఎఫ్‌ఐఆర్ కాపీ కోసం ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ‘"www.tspolice.gov.in'’ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకొని.. సంబంధిత జిల్లా, పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్‌ఐఆర్ నంబర్ లేదా ఎఫ్‌ఐఆర్ నమోదు తేదీని ధృవీకరించుకొని కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పిటిషన్‌పై కేసు నమోదు చేయకపోతే.. పిటిషన్ ప్రస్తుత పరిస్థితిని వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు.
ప్రజలకు చేరువయ్యేలా చర్యలు అదనపు డీజీపీ రవిగుప్తా
రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ఫిర్యాదుదారులకు సంక్షిప్త సందేశం పంపిస్తున్నామని, కొన్నిసార్లు సమస్య లొచ్చినా క్షణాల్లో సిబ్బంది పరిష్కరిస్తు న్నారని పోలీస్ కంప్యూటర్ సర్వీస్ అదనపు డీజీపీ రవిగుప్తా చెప్పారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువయ్యేలా చర్యలు చేపడుతు న్నామని వెల్లడించారు. సీసీటీఎన్‌ఎస్ ద్వారా పోలీస్ శాఖపై నమ్మకం మరింత పెరుగుతుందని డీజీపీ అనురాగ్‌శర్మ అభిప్రాయపడ్డారు.