=కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లు కుమ్మక్కు
=రోడ్డు పనులపైనే మోజు
=తూతూమంత్రంగా పనులు
=మూడ్రోజులకే నాణ్యతకు తూట్లు
=వర్షాలే కారణమంటూ సాకులు
=అటు కాంట్రాక్టర్లకు లాభం
=ఇటు కార్పొరేటర్లకు ప్రయోజనం
సాక్షి, సిటీబ్యూరో: అటు వర్షాలే కాదు.. ఇటు కార్పొరేటర్లు, కాంట్రాక్టర్ల ‘కమీషన్ల’ వ్యవహారాలు కూడా నగర రహదారులకు తూట్లు పొడుస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు తమ డివిజన్లలో ప్రజోపయోగకరమైన పనులు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఏటా కోటి రూపాయల్ని కార్పొరేటర్ల బడ్జెట్ కింద మంజూరు చేస్తోంది.
ఈ నిధుల నుంచి మన కార్పొరేటర్లు ఏ పనులకు ఎక్కువ వెచ్చిస్తున్నారో తెలుసా?.. రోడ్ల పనులపై!. ఇంతగా ఖర్చు చేస్తున్నా నగరవాసులు రోడ్డెక్కగానే ఒళ్లు, బళ్లు హూనమవుతున్నాయెందుకనే అనుమానం రావొచ్చు.. నిజమే!.. నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటే రోడ్లకు చిల్లు పెట్టడం కన్నా సులువైన పనేమీ లేదు మరి!. కాంట్రాక్టర్ల ద్వారా అందే కమీషన్లు కార్పొరేటర్లను ఊరిస్తున్నాయి. పైగా రోడ్లేతర పనుల పూర్తికి చాలా సమయం పట్టడంతో పాటు కాంట్రాక్టర్లకూ పెద్దగా లాభాలుండవు. అందుకే జీహెచ్‌ఎంసీలో పేరు నమోదు చేయించుకున్న చాలామంది కాంట్రాక్టర్లు ఇతర పనుల జోలికి వెళ్లరు.
అందరూ రోడ్డు పనులపైనే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే.. నాణ్యతపై పట్టింపు ఉండదు. నాలుగు రోజుల్లోనే రోడ్డు కొట్టుకు పోయినా వర్షాల సాకు ఉండనే ఉంది. అందుకే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడేది రోడ్ల పనులకే. వారు ఆసక్తి చూపే పనులిస్తేనే కార్పొరేటర్లకు కాసులు రాలేది. అందుకే మన ప్రజాప్రతినిధులు కమీషన్ లెక్కలేసుకుని తమ బడ్జెట్ నిధుల నుంచి రోడ్ల పనులు చేసేందుకే ఎక్కువ మోజు చూపుతున్నారు. తద్వారా ఇద్దరూ ప్రయోజనం పొందుతున్నారు.
సాధారణ బడ్జెట్‌లోనూ పెద్ద వాటా..
జీహెచ్‌ఎంసీ సాధారణ బడ్జెట్ నుంచి సైతం రోడ్ల పనులకే పెద్ద మొత్తాల్లో వెచ్చిస్తున్నారు. అటు ఆ బడ్జెట్ నుంచి.. ఇటు కార్పొరేటర్ల బడ్జెట్ నుంచి రోడ్ల పనులకు, అందులోనూ మైనర్ రోడ్లు, చిన్నచిన్న బిట్ల పనులకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే.. చిన్న పనులకైతే చేసేందుకు సమయం తక్కువ. వచ్చే లాభాలెక్కువ. కార్పొరేటర్ల నిధుల నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ పనుల కోసం రూ. 84.59 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు రూ. 5.86 కోట్ల చెల్లింపులు జరిగితే.. అందులో 30 శాతం రోడ్లకు సంబంధించిన చిన్న పనులపైనే వెచ్చించారు.
ఇవి కాక రోడ్ల తవ్వకాలు, పునరుద్ధరణ, మేజర్ రోడ్ల అభివృద్ధి తదితరాల పేరిట మరో 10 శాతం ఖర్చు చేశారు. కార్పొరేటర్లు తమ బడ్జెట్ నిధులు కేటాయించిన ఇతర పనుల్లో పండుగల పనులు, ఇతరత్రా పనుల పేరిట రూ. 6.76 కోట్లు, నీటి కాలువల నిర్వహణకు రూ.5.21 కోట్లు, శ్మశానవాటికల మరమ్మతులకు రూ. 1.21 కోట్లు, భవనాల మరమ్మతులకు రూ. 1.13 కోట్లు ఖర్చు చేశారు. ఇవికాక ఆట పరికరాలు, మురుగు కాలువల పనులు ఇతర పనుల కోసం మరికొంత ఖర్చు చేశారు. సాధారణ, కార్పొరేటర్ల బడ్జెట్ల నుంచి అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్నది రోడ్లకే అయినా నగర రోడ్లు ఎప్పుడు చూసినా అధ్వానంగా ఉంటుండటమే విశేషం.
ఇటు కార్పొరేటర్లకు ప్రయోజనం
Published Sat, Nov 16 2013 5:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement