ఆకుపచ్చ నగరం
- ఆగస్టులో 16.50 లక్షల మొక్కల పంపిణీ
- కార్పొరేటర్లు, షాపింగ్ మాల్స్, విద్యాసంస్థల ద్వారా సరఫరా
- ఏర్పాట్లలో జీహెచ్‌ఎంసీ
సాక్షి, సిటీబ్యూరో: కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో పచ్చదనం కరువైంది. గ్రేటర్ నగరాన్ని హరిత వనంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాలతో అధికారులు కస రత్తు ప్రారంభించారు. వర్షాకాలం ప్రారం భం కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు మొదటి వారంలో 16.50 లక్షల మొక్క లు పంపిణీ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు . వీటిని కార్పొరేటర్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థల ద్వారా ప్రజలకు సరఫరా చేయనున్నారు.
ప్రజలు మక్కువ చూపే మొక్కల్నే పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇళ్ల వద్ద నాటేందుకు 4 లక్షలు, విద్యాసంస్థల్లో నాటేం దుకు 2 లక్షల మొక్కలు పంపిణీ చేయాలని ప్రతిపాదించారు. వీటితోపాటు ప్రభుత్వ ఖాళీ స్థలాలు, జీహెచ్‌ఎంసీ ఓపెన్ ప్లేస్‌లు, రోడ్డుకిరువైపులా, ట్రాఫిక్ ఐలాండ్లు, శ్మశానవాటికలు, పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు, పార్కులు తదితర ప్రాంతాల్లో మరో 10.50 లక్షలు ఈ సీజన్‌లో నాటాలని తీర్మానించారు.
వీటిని సమకూర్చుకునేందుకు జీహెచ్‌ఎంసీ జీవవైవిధ్య విభాగం అధికారులు హెచ్‌ఎండీఏ, జలమండలి, ఔషధ, సుగంధ మొక్కల బోర్డు, సిమాప్,రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధన సంస్థ, సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రాల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మొక్కలకు రక్షణకుగాను ట్రీగార్డుల్ని కూడా ఏర్పాటు చేస్తారు. అందంగా కనిపించే వివిధ రంగుల పూల మొక్కలను రోడ్ల వెంబడి నాటుతారు.
పంపిణీ చేసే మొక్కలు
తులసి, ఉసిరి, అలోవీరా, జామ, దానిమ్మ, నారింజ, సపోటా, నిమ్మ, మామిడి, సీతాఫలం తదితర మొక్కలు పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు గుల్‌మొహర్, పగోడ, పెల్టో ఫోరం, తదితర జాతులకు చెందిన మొక్కల్ని కూడా పంపిణీ చేస్తారు.
కార్పొరేటర్ల ద్వారా..
గృహాలకు పంపిణీ చేసే 4 లక్షల మొక్కల్లో మూడు లక్షల మొక్కలను కార్పొరేటర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో కార్పొరేటర్ ద్వారా 2వేల మొక్కలు పంపిణీ చేస్తారు.