
సిరిసిల్ల నుంచి జేఏసీ రెండో విడత యాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సమస్యల పరిష్కారం, ప్రభుత్వ హామీల అమలులో వైఫల్యంపై టీజేఏసీ చేపడుతున్న రెండో విడత యాత్రను సిరిసిల్ల నుంచి నిర్వహించాలని భావిస్తోంది. సంగారెడ్డి నుంచి సిద్దిపేట దాకా ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించిన అమరుల స్ఫూర్తి యాత్రకు వచ్చిన ఆదరణ క్రమంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు.
సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్‌లోనే జేఏసీ యాత్రకు మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందడంలేదన్నారు. నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగుల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని వెల్లడించారు. స్ఫూర్తి యాత్రను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామన్నారు. రెండో విడత యాత్రపై ఇంకా తేదీలు, ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే సిరిసిల్ల నుంచి రెండో విడత అమరుల స్ఫూర్తి యాత్రను నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. జేఏసీలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు.