ఉదయం 9.45 గంటలకు మహా గణపతికి తొలిపూజ
ఖైరతాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతికి గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం ఉదయం 9.45 గంటలకు తొలిపూజ నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీఅధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞోపవీతం, కండువా సమర్పిస్తారు. పూజ పూర్తికాగానే సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు ఆధ్వర్యంలో ఆరు వేల కిలోల మహాప్రసాదాన్ని క్రేన్‌తో మహా గణపతి చేతిలో పెడతారు.
పటిష్ట భద్రత
మహా గణపతి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు, బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్థానికుల సౌకర్యార్ధం బారికేడ్లు తొలగించడం, తిరిగి మూసివేయడం వంటి పనులు చేయాలని, ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని సైఫాబాద్ డీఐ ప్రకాశ్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్‌లకు డీసీపీ సూచించారు. పోలీసులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు సింగరి సుదర్శన్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘డిక్టేటర్’ పాట విడుదల
ఖైరతాబాద్‌లోని త్రిశక్తిమయ మోక్ష గణపతి వద్ద ‘డిక్టేటర్’ చిత్రంలోని ‘గం..గం.. గణేశా..’ పాటను గురువారం రాత్రి 7 గంటలకు విడుదల చేయునున్నారు. ఈ కార్యక్రమానికి హీరో బాలకృష్ణ, హీరోయిన్ అంజలి, దర్శకుడు శ్రీవాస్, గీత రచయిత రావుజోగయ్యు శాస్త్రి తదితరులు హాజరుకానున్నారు.
ఖైరతాబాద్ గణేషుడి వద్ద ‘జియోనెట్’ వై-ఫై
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు వస్తుంటారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐల్), రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్‌జేఐఎల్) ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఖైరతాబాద్ గణేశుడి వద్ద ‘జియోనెట్’ వై-ఫై సేవలను అందించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. సందర్శకులు తమ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లపై జియో నుంచి వై-ఫై నెట్‌వర్క్ ద్వారా హైస్పీడ్ వైర్‌లెస్ కనెక్టివిటీ ప్రయోజనాలు పొందవచ్చన్నారు.