అక్కడ కార్లు చోరీ.. ఇక్కడ రూపుమార్చి విక్రయం | theft in north - sale in the south | Sakshi
Sakshi News home page

అక్కడ కార్లు చోరీ.. ఇక్కడ రూపుమార్చి విక్రయం

Published Tue, Dec 8 2015 7:59 PM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM

అక్కడ కార్లు చోరీ.. ఇక్కడ రూపుమార్చి విక్రయం

అక్కడ కార్లు చోరీ.. ఇక్కడ రూపుమార్చి విక్రయం

- హై ఎండ్ వాహనాలే టార్గెట్
- ఆరు రాష్ట్రాల్లో వాహన చోరీలు
- నంబర్లు మార్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్మకం
- భారీ స్కాం బయటపెట్టిన సీసీఎస్ పోలీసులు

హైదరాబాద్

బీమా కంపెనీల డేటాబేస్ నుంచి యాక్సిడెంట్ వెహికిల్స్ వివరాలు సేకరించడం... ఆయా సంస్థల్ని సంప్రదించి స్క్రాప్ ముసుగులో వాటిని ఖరీదు చేయడం... పత్రాలతో పాటు 'విడిభాగాలు' సేకరించడం... ఉత్తరాదిలో చోరీ చేయించిన వాహనాలకు వీటిని వినియోగించడం... అయితే అమ్మేయడం, లేదంటే ఫైనాన్స్ చేయించుకోవడం... ఈ పంథాలో గడిచిన 11 నెలల్లో 35 ఆధునిక వాహనాలను చోరీ చేసిన అంతరాష్ట్ర ముఠాను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 13 వెహికిల్స్‌తో పాటు మార్పిడి పరికరాలు, బోగస్ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా తెలిపారు. సంయుక్త పోలీసు కమిషనర్ డాక్టర్ టి.ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు.

నకిలీ రిజిస్ట్రేషన్లతో దందా ప్రారంభం...
విశాఖకు చెందిన సంగపు చక్రధర్ అలియాస్ వంశీ 2009 నుంచి నేరబాట పట్టాడు. మొదట్లో ఇతర రాష్ట్రాల్లో చోరీ అయిన వాహనాలకు దొంగ రిజిస్ట్రేషన్లు చేయించి.. రుణాలు తీసుకుంటూ ద్వారా ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులకు టోకరా వేస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. ఇదే తరహాలో ఢిల్లీ, నోయిడా, ముంబై తదితర చోట్ల అరెస్టు అయ్యాడు.

ఆ తరవాత ట్రాక్ మార్చిన చక్రధర్.. ఇన్సూరెన్స్ కంపెనీల ఆన్ లైన్ డేటాబేస్ మీద కన్నేశాడు. ప్రమాదాలకు లోనైన వాహనాలకు బీమా సొమ్ము చెల్లించే ఆయా సంస్థలు వాహనాలను స్వాధీనం చేసుకుంటాయి. స్క్రాప్‌లా అమ్మేందుకు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తాయి. ఈ వివరాలను తెలుసుకునే చక్రధర్ ఆయా సంస్థల్ని సంప్రదించి వాహనంతో పాటు దాని పత్రాలను ఖరీదు చేసేవాడు. పత్రాలతో పాటు వాహనం ఇంజన్, ఛాసిస్ నెంబర్లు ఉండే భాగాలను భద్రపరిచి మిగిలింది స్క్రాప్‌గా అమ్మేసేవాడు. తన వద్ద ఉన్న పత్రాల్లో ఉన్న కంపెనీ, మోడల్, రంగుతో కూడిన కార్లను ఉత్తరాదిలో చోరీ చేయిస్తాడు.  దీనికోసం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా తదితర రాష్ట్రాల్లో 20 మంది అనుచరుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే చోరీ చేసిన వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్, పత్రాల సాయంతో వాహనాలను దర్జాగా హైదరాబాద్ కు తీసుకువస్తారు.

రాగన్నగూడలో 'మినీ వర్క్‌షాప్'
ఇలా నగరానికి చేరుకున్న వాహనాలను చక్రధర్ రాగన్నగూడలో ఏర్పాటు చేసుకున్న డెన్‌కు తీసుకొస్తారు. అక్కడ  పి.శివ, జి.రత్న కిషోర్, కె.శ్రీనివాసరావుల సాయంతో చోరీ వాహనానికి సంబంధించిన ఇంజన్, ఛాసిస్ నంబర్లు ఉండే ప్రాంతాలను కత్తిరించి 'స్క్రాప్' నుంచి సేకరించిన వాటిని అతికిస్తారు. అప్పటికే బీమా కంపెనీ నుంచి సేకరించిన 'స్క్రాప్ వాహనాల' పత్రాలు వీరి వద్ద ఉండటంతో ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌నే చోరీ వాహనానికి వేస్తున్నారు. కోయంబత్తూరు కేంద్రంగా పని చేసే ప్రముఖ వాహనాల ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైనింగ్ సంస్థ దిలీప్ ఛాబ్రియా (డీసీ డిజైన్స్) ఔట్‌లెట్స్‌లో దాని రూపురేఖలు మార్చేస్తారు. దీంతో ఆర్టీఏ అధికారులు, ఆ వాహనం పొగొట్టుకున్న వారు సహా ఎవ్వరూ చోరీ చేసిన వాహనాన్ని గుర్తించడం సాధ్యం కాదు. ఇలా దొంగ వాహనాన్ని ముస్తాబు చేసి తెలుగు రాష్ట్రాల్లో అమ్మేస్తున్నారు.

'పుణె' నేర్పిన పాఠంతో..
చక్రధర్ గ్యాంగ్ ఈ ఏడాది మేలో పుణెలోని ఖత్రుడ్ ప్రాంతంలో ఓ ట్రావెల్స్‌కు చెందిన వాహనాన్ని చోరీ చేయించింది. దాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చి, రూపురేఖలు మార్చిన చక్రధర్ సొంతానికి వాడుతున్నాడు. ఈలోపు ఓరోజు వనస్థలిపురం ప్రాంతంలో ఉండగా... నేరుగా వచ్చిన ఖత్రుడ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు వరకు అక్కడి ఎరవాడ జైల్లో శిక్షఅనుభవించిన చక్రధర్.. తాను చేసిన తప్పేంటో తోటి దొంగల ద్వారా చర్చించాడు. హైఎండ్ వాహనాల్లో కంపెనీలు ఇంజన్ కంట్రోల్ మాడ్యూల్ (ఈసీఎం) అనే పరికరాన్ని ఏర్పాటు చేస్తాయని, ఇగ్నిషన్ తాళంతో అనుసంధానమై ఉండే ఈ పరికరం కారు స్టార్ట్ చేయగానే జీపీఎస్ కు అనుసంధానమై యజమానికి ఆ వాహనం ఉన్న ప్రాంతాన్ని చూపిస్తుందని అర్థం అయ్యింది. తాను చిక్కడానికి పుణెలో చోరీ చేసిన కారులో ఉన్న ఈసీఎం కారణమని తెలియడంతో ఆ తరవాతి నుంచి మరింత జాగ్రత్తగా ఈ పరికరాన్ని రీప్లేస్ చేసే ఏర్పాటు చేశాడు. ఫలితంగా వాహనాల్లో  జీపీఎస్ కట్ అయిపోతోంది.

ఎట్టకేలకు చిక్కిన ముఠా...
దొంగతనం చేసిన వాహనాలు అమ్ముడుకాకపోతే.. వాటిపై ఫైనాన్స్ తీసుకునేవాడు. రుణం కట్టడం మానేసే వాడు. యూపీలోని ఓ సంస్థ నుంచి రూ.45 లక్షలు, విశాఖలో మరో 9 వాహనాలపై భారీ మొత్తం రుణం తీసుకున్నాడు. ఈ రుణం తీసుకోవడంలో ఫైనాన్స్ సంస్థలో పనిచేసే శ్రీనివాసరెడ్డి లంచం తీసుకుని సహకరించాడు. ఈ గ్యాంగ్ వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్లు వి.శ్యాంబాబు, డి.సుధీర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి వలపన్ని చక్రధర్, శివ, కిషోర్, శ్రీనివాసరావు, విజయ్, తన్వీర్‌లను అరెస్టు చేసి 13 వాహనాలు రికవరీ చేశారు. పరారీలో ఉన్న వారిని పట్టుకోవడంతో పాటు విశాఖలో ఉన్న తొమ్మిదింటితో పాటు వాహనాలను రికవరీ చేయాల్సి ఉందని స్వాతిలక్రా తెలిపారు. వీరు చోరీ చేసిన వాటిలో ఇన్నోవా, స్కార్పియో, డస్టర్, టవేరా, వెర్నా, స్విఫ్ట్ తదితరాలు ఉన్నాయి. రూపురేఖలు మారిపోయిన వాహనాల యజమానుల గుర్తింపూ కష్టంగా ఉందని, ఇప్పటికి ఇద్దరిని మాత్రమే గుర్తించామని అన్నారు. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఆమె చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement