ఈ మత్తు లోకల్!
ఈ మత్తు లోకల్!
Published Sat, Jul 15 2017 2:34 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
- ఎల్‌ఎస్‌డీ తరహాలో డ్రగ్‌ను తయారు చేసిన పీయూష్ అనే యువకుడు
- నగరంలో వెలుగులోకి వచ్చిన కొత్త మత్తు దందా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కొత్త ‘లోకల్’ డ్రగ్‌బయటపడింది.. ఎల్‌ఎస్‌డీ తరహాలో ఇక్కడే తయారు చేసిన కొత్త మత్తు పదార్థం వెలుగు చూసింది. వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన పీయూష్ అనే యువకుడు.. వయాగ్రా, గంజాయి, యాంటీ డిప్రెషన్ మందులు, నిద్ర మాత్రలు కలిపి ఈ డ్రగ్‌ను రూపొందించాడు. తన మీద తానే ప్రయోగాలు చేసుకుంటూ దానిని ఎల్‌ఎస్‌డీ తరహాలో తయారు చేశాడు. దానికంటే తక్కువ ధరలో వందల మంది యువతకు సరఫరా చేస్తున్నాడు. ఎక్సైజ్ యాంటీ నార్కోటిక్ టీమ్ అధికారులు ఈ దందాను ఛేదించి.. పీయూష్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి ‘లోకల్’ఎల్‌ఎస్‌డీని, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎక్సైజ్ డీసీ వివేకానందరెడ్డి, టీమ్ లీడర్ అంజిరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.
పెద్ద నోట్ల రద్దుతో..
హైదరాబాద్‌లోని వెస్ట్‌మారేడుపల్లికి చెందిన పీయూష్ 2010లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. అనంతరం జంటాక్ కంపెనీలో ఉద్యోగంలో చేశాడు. తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో చేరాడు. కానీ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో ఆ కంపెనీ కొందరు ఉద్యోగులను తొలగించింది. వారిలో పీయూష్ కూడా ఉన్నాడు. అయితే ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే గంజాయి అలవాటున్న పీయూష్‌కు.. ఓ రేవ్‌పార్టీలో ఎల్‌ఎస్‌డీ డ్రగ్ పరిచయమైంది. ఉద్యోగం పోయిన బాధలో పూర్తిగా ఆ డ్రగ్‌కు బానిసయ్యాడు. దానికి వేల రూపాయలు ఖర్చు చేయలేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తి... డ్రగ్స్ సరఫరా దారుడిగా మారాడు. డార్క్‌నెట్ ద్వారా విదేశాల నుంచి ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్ తెప్పించి అమ్మాడు. ఆ డ్రగ్ ఖరీదు ఎక్కువగా ఉండడంతో తానే డ్రగ్ తయారు చేశాడు.
ఎలా చేశాడంటే..?
స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌పై మంచి పట్టున్న పీయూష్ నార్కోటిక్ డ్రగ్స్, వాటి స్వభావంపై దాదాపు రెండు నెలల పాటు ఇంటర్‌నెట్‌లో శోధించాడు. ఎల్‌ఎస్‌డీకి కావాల్సిన ముడి పదార్థాలు, మోతాదులు, ఆ డ్రగ్‌ను తీసుకున్న వ్యక్తి మానసిక పరిస్థితి తదితర అంశాలపై అధ్యయనం చేశాడు. ఆయా ముడి పదార్థాలను సేకరించి డ్రగ్ తయారు చేశాడు. తనపైనే ప్రయోగాలు చేసుకుని.. పనిచేస్తోందని నిర్ధారించుకున్నాడు. నెదర్లాండ్స్ నుంచి కొరియర్ సర్వీస్ ద్వారా బ్లాటింగ్ పేపర్లు తెప్పించాడు. తాను తయారు చేసిన రసాయనాన్ని బ్లాటింగ్ పేపర్‌పై వేసి.. దానిపై వృత్తాకారాలను ముద్రించాడు. ఒక్కొక్క ‘లోకల్’డ్రగ్ స్లిప్‌ను రూ.800 నుంచి రూ.1000 చొప్పునæ విక్రయించాడు. తక్కువ ధరకే డ్రగ్ దొరకటంతో ఎక్కువ మంది యువత దానివైపు మళ్లినట్టు అధికారులు చెబుతున్నారు.
అధికారులు స్వాధీనం చేసుకున్నవి
► 2,746 స్ట్రిప్పుల కెమికల్ కోటెడ్ ఎస్‌ఎస్‌డీ
► 20 గ్రాముల గంజాయి
► 40 గ్రాముల తెలుపు రంగులోని పొడి
► 4 వెన్‌లార్ –ఆర్‌ఎక్స్ 75 ఎంజీ టాబ్లెట్లు
► 5 వెన్‌లార్ –ఆర్‌ఎక్స్ 150 ఎంజీ టాబ్లెట్లు ఒక ల్యాప్‌టాప్
Advertisement
Advertisement