టిప్పర్ బీభత్సం | Tipper devastation | Sakshi
Sakshi News home page

టిప్పర్ బీభత్సం

Published Mon, Dec 23 2013 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

టిప్పర్ బీభత్సం

టిప్పర్ బీభత్సం

=8 మందికి గాయాలు
 =ఇద్దరి పరిస్థితి విషమం
 నాలుగు వాహనాలు ధ్వంసం

 
రాజేంద్రనగర్/మణికొండ, న్యూస్‌లైన్: వేగంగా వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలతో పాటు పార్కు చేసిన వాహనాలను, బస్సుకోసం వేచివున్న మహిళను, రోడ్డు పక్కన టీ తాగుతున్న యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎనిమిది మంది గాయపడగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం మత్తులో ఉన్న టిప్పర్ డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు.

నార్సింగ్ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం...  ఆదివారం ఉదయం 11.30కి డ్రైవర్ అబ్దుల్‌నయాం (35) టిప్పర్ (ఏపీ 12 టి 4007)ను వేగంగా నడుపుకుంటూ లంగర్‌హౌస్ మీదుగా ఖాళీమందిర్ వైపు వస్తున్నాడు. హైదర్‌షాకోట్ సన్‌సిటీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు రాగానే టిప్పర్ అదుపుతప్పింది. వాహనాన్ని ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించగా బ్రేక్ ఫెయిలై ముందు వెళ్తున్న బైక్ (ఏపీ 28 డిజె 0570)ను ఢీకొట్టడంతో పాటు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న మరో ఆక్టివా (ఏపీ 28 డిఎ 9636), ఆటో (ఏపీ 28 వి 2417)లను ఢీకొట్టింది.

అంతటితో రోడ్డుపై వెళ్తున్న కారు ( ఏపీ 09 ఎఎ 2460)ను, బస్టాప్‌లో బస్సు కోసం వేచిచూస్తున్న మణెమ్మ(45), పక్కనే టీ తాగుతున్న ఫిలిప్స్(35)లను ఢీకొట్టింది. మణెమ్మ కాళ్లు నుజ్జునుజ్జు కాగా.. ఫిలిప్స్ ఎగిరి రోడ్డు పక్కన పడటంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. కారులో వెళ్తున్న గాయత్రినగర్ కాలనీకి చెందిన మామాఅల్లుళ్లు సుదర్శన్, బాలబ్రహ్మంలు తీవ్రగాయాలయ్యాయి.  వీరి తో పాటు పూడురు సుందర్, కొల్లూరు నగేశ్, కె.జె. నితానియల్, మహామూద్‌లతో పాటు మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వివిధ ఆస్పత్రులకు తరలించారు. స్థానికులు పట్టరానికి కోసంతో టిప్పర్ డ్రైవర్ నయీమ్‌ను చితకబాదారు. సకాలంలో చేరుకున్న పోలీసులు స్థానికులను చెదరగొట్టి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 పరుగు తీసిన పాదచారులు, వాహనదారులు...
 ఆదివారం కావడంతో సన్‌సిటీ రోడ్డు వాహనాలు, పాదచారులతో కిటకిటలాడుతోంది. మృత్యుశకటంలా దూసుకొస్తున్న టిప్పర్‌ను చూసి  పాదచారులతో పాటు రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు తమ వాహనాలు దిగి అక్కడి నుంచి పరుగు తీశారు.
 
 భయానకంగా ఘటనాస్థలం...
 చెల్లాచెదురైన వాహనాల విడిభాగాలు, అద్దాలు, క్షతగాత్రుల రక్తపుమరకలతో ఘటనా స్థలం భయానకంగా మారింది.
 
 కుమారుడు వాహనాన్ని మళ్లించేలోపు...
 బాకారం వెళ్లేందుకు మణెమ్మ తన కుమారుడు శ్రీకాంత్ ద్విచక్రవాహనంపై సన్‌సిటీ బస్టాప్‌కు వచ్చింది. కుమారుడు బస్టాప్‌లో దించి తన వాహనాన్ని మళ్లిస్తుండగానే టిప్పర్ మణెమ్మను ఢీకొట్టింది. ఈ సంఘటనను చూసిన శ్రీకాంత్ బోరున విలపించాడు. తల్లిని హుటాహుటిన కేర్ ఆస్పత్రికి తరలించాడు.
 
 టీ తాగేందుకు వచ్చి....
 సన్‌సిటీ ప్రాంతంలో ఓ ఇంటికి రంగులు వేస్తున్న సఫిల్‌గూడకు చెందిన ఫిలిప్స్ ఉదయం టీ తాగేందుకు రోడ్డుపైకి వచ్చాడు. బస్టాప్ పక్కనే ఉన్న టీకొట్టు వద్ద టీ తాగుతుండగా టిప్పర్ ఢీకొట్టింది. తీవ్రగాయాలకు గురైన ఫిలిప్స్ చావుబతుకుల మధ్య చికిత్సపొందుతున్నాడు.
 
 కారు నుజ్జునుజ్జైనా చిన్నపాటి గాయాలతో...

 బండ్లగూడ గాయత్రినగర్‌కు చెందిన మామాఅల్లుళ్లు సుదర్శన్, బాలబ్రహ్మంలు కారులో వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. కాగా, ముందు సీట్లో కూర్చున్న మామాఅల్లుళ్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement