హిమాయత్‌నగర్: బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని శాసనమండలి చైర్మన్ కె.స్వామి గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో పాత్రికేయులు కూడా కీలక పాత్రే పోషించారన్నారు. శనివారం హిమాయత్‌నగర్‌లో ‘లిబర్టీ మీడియా సెంటర్’ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సగటు మనిషి ఆశలు, ఆలోచనలకు వారధిగా...లిబర్టీ మీడియా సెంటర్ ఉండాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్రోద్యమం సమయంలో సమాచారం బార్బర్ షాపుల్లో దొరికేదని, వార్తల కోసమే బార్బర్ షాపులకు వెళ్లేవారని గుర్తుచేస్తూ...సామాన్యుడి గళాన్ని, ఆవేదన వ్యక్తీకరణకు ఇలాంటి మీడియా సెంటర్‌లు కృషి చేయాలని సూచించారు.
ప్రతి సమస్యపై లోతైన చర్చ జరగాలని, ఆ చర్చ సారాన్ని బంగారు తెలంగాణ సాకారానికి కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం దగ్గరకు తీసుకుపోవాల్సిన బాధ్యతకూడా మీడియా సంస్థలపై ఉందని గుర్తుచేశారు. బీసీలకు రిజర్వేషన్ ఉన్నట్లే ఓసీల్లో అత్యంత దుర్భర జీవితాలను అనుభవించేవారూ ఉన్నారని, అలాంటి వారిని గుర్తించాల్సిన బాధ్యత పభుత్వాలతోపాటు మీడియా పైనా ఉందన్నారు.
అవసరమైతే 10 సంవత్సరాలు వయోపరిమితి సడలించి నిరుద్యోగులందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారని, నెల రోజుల్లో నోటిపికేషన్ విడుదల చేస్తామంటున్న టీపీఎస్సీ..ముఖ్యమంత్రి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలని స్వామిగౌడ్ సూచించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు సి.విఠల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మీడియా రోల్ చాలా గొప్పదన్నారు. ఒక సామాజిక కోణంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేసిన లిబర్టీ మీడియా సెంటర్ నిర్వాహకులు అభినందనీయులన్నారు.
‘స్వేచ్ఛ’ అవసరం: ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
సాధారణ పౌరుని నుంచి ఉన్నతస్థాయి వ్యక్తి వరకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైందని, ఆ భావ వ్యక్తీకరణకు మీడియాది ప్రముఖమైన భూమిక అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మీడియా అన్నివేళలా ప్రజల పక్షాన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పాత్రికేయులు, బీజేపీ గ్రేటర్ ఉపాధ్యక్షులు జి.రామన్‌గౌడ్, సంఘ సేవకులు రెడ్డి వెంకటేశ్వరెడ్డి, బీజేపీ నగర నాయకులు కేశబోయిన శ్రీధర్, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.
బంగారు తెలంగాణకు అందరూ సహకరించాలి: స్వామిగౌడ్
Published Sun, Mar 22 2015 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM
Advertisement